న్యూఢిల్లీ: విశ్వ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా. అందని ద్రాక్షగా ఉన్న దశాబ్దాల కలను నెరవేర్చి భారతీయుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే, తాను సాధించిన బంగారు పతకంలాగే నీరజ్ మనసు కూడా బంగారమేనట. స్నేహితుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడేందుకు ఈ 23 ఏళ్ల ఆర్మీ సుబేదార్ వెనుకాడట. గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఫ్రెండ్, భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ ఈ మాట అంటున్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన కాలమ్‌లో.. నీరజ్ అందరికంటే ఎంతో ప్రత్యేకమని, ఎవరి మనసునూ నొప్పించడని పేర్కొన్న తేజస్విన్.. అతడితో తనకున్న అనుబంధం గురించి పలు విషయాలు పంచుకున్నాడు.
‘‘మా అందరి కంటే తను ఎంతో విభిన్నం. ఇండియాకు తొలి స్వర్ణం సాధించి పెట్టిన అథ్లెట్ కదా తను. కానీ తనకు ఏమాత్రం గర్వం ఉందు. జోహన్నెస్ వెట్టర్(జర్మనీ జావెలిన్ త్రో ప్లేయర్- వరల్డ్ నంబర్ 1)కు పతకం చేజారడం తను విచారం వ్యక్తం చేశాడు. ఒక స్నేహితుడు ఏదైనా కోరితే.. నో చెప్పడం నీరజ్‌కు అస్సలు ఇష్టం ఉండదు. ఎంతో మంది స్నేహితులు తన నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నారు. కానీ.. తను మాత్రం కనీసం వారి పేర్లు కూడా రాసుకోలేదు. ఈ విషయం నీరజ్ నాకు స్వయంగా చెప్పాడు. ఇతరులను ఇబ్బందిపెట్టడం తనకు ఏమాత్రం ఇష్టం ఉండదు
అమ్మో.. నీరజ్‌తో రూం షేర్ చేసుకుంటే అంతే ఇక!
నీరజ్‌కు అత్యంత ఆప్తుడైన హైజంపర్ తేజస్విన్ 2018 కామన్‌వెల్త్ గేమ్స్ వంటి మేజర్ ఈవెంట్ల సమయంలో అతడితో కలిసి రూం కూడా షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో.. బెంగళూరులో రెండు వారాల పాటు తనతో కలిసి ఉన్న విషయాన్ని గుర్తుచేసుకున్న తేజస్విన్.. ‘‘15 రోజుల పాటు నీరజ్‌తో ఒకే గదిలో ఉన్నాను. తను ఒలింపిక్ చాంపియన్ అయితే కావొచ్చు గానీ.. ఇప్పటికీ తనతో రూం షేర్ చేసుకోవాలంటే నాకు భయమే. ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుకోవడం తనకు చేతకాదు. ఒక్కసారి తన గదిలోకి వెళ్లి చూస్తే.. దుస్తులేమో బెడ్ మీద ఆరేసి ఉంటాయి.. సాక్సులు ఎక్కడో కింద పడేసి ఉంటాయి. అయినా నేనేమీ అనేవాడిని కాదు. ఎందుకంటే తనతో గదిని పంచుకోవడమే నాకు గొప్ప విషయం.
ఇద్దరం కలిసి ఫ్రైడ్ రైస్ తినేవాళ్లం. రాత్రివేళ మట్కా కుల్ఫీ లాగించేసేవాళ్లం. వీడియో గేమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. మినీ మిలిటియా అంటే తనకు క్రేజ్. ఇక టోక్యోలో నీరజ్ పసిడి గెలిచాడని తెలియగానే.. నేను ఆనందంతో ఉబ్బితబ్బియ్యాను. 20 పుషప్‌లు చేశాను. పారిస్‌కు ఎలా సన్నద్ధం కావాలన్న అంశం గురించి అప్పుడే ఆలోచనలు గిర్రున తిరిగాయి’’ అని స్నేహితుడి అరుదైన ఘనత పట్ల తేజస్విన్ సంతోషం వ్యక్తం చేశాడు.
గర్ల్‌ఫ్రెండ్ ఉందా అని అడుగుతా
‘‘స్నేహితుల కోసమే ఇంత చేస్తాడు కదా.. ఈసారి నీరజ్‌ను కలిస్తే.. ‘‘నీకు గర్ల్‌ఫ్రెండ్ ఉందా’’ అని అడుగుతాను’’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా తమిళనాడుకు చెందిన తేజస్విన్ 2017లో అమెరికాకు వెళ్లి కేన్సస్ స్టేట్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు అభ్యసిస్తూ అథ్లెటిక్స్ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల అమెరికాలో జరిగిన బిగ్–12 అవుట్‌డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల హైజంప్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు.
చదవండి: Aditi Ashok: పార్, బర్డీ, ఈగల్.. ఈ పదాలు ఏంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment