Photo Credit: Twitter
ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్‌లో నేపాల్, యూఏఈ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ రసాభాసగా మారింది. ఆటగాళ్ల మధ్య జరిగిన మాటల యుద్ధం ఘర్షణకు దారి తీసింది. కౌలలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో యూఏఈ 314 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ సందీప్ లమిచానే వేశాడు. అయితే ఓవర్ ప్రారంభానికి ముందే నాటకీయ పరిణామం చోటుచేసుకుంది.
స్ట్రైక్‌లో ఉన్న తనిష్ సూరిని ఉద్దేశించి వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్న ఆసిఫ్ షేక్ చికాకు తెప్పించేలా వ్యాఖ్యలు చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన తనిష్ సూరి ఆసిఫ్ షేక్‌తో మాటల యుద్ధానికి దిగాడు. ఇది గమనించిన సందీప్ లమిచానే ఒక్కసారిగా తనిష్ సూరివైపు దూసుకొచ్చాడు.
అప్పటికే అక్కడికి చేరుకున్న మాజీ కెప్టెన్ రోహిత్ పౌడెల్, అర్జున్ కుమాల్‌లు తనిష్‌ను పక్కకు నెట్టేశారు. చూస్తుండగానే గొడవ పెద్దది కావడంతో తనిష్ లెగ్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అంపైర్లు విశ్వనాథన్ కాళిదాస్, తబారక్ దార్ జోక్యం చేసుకొని ఆటగాళ్లకు సర్దిచెప్పారు. దీంతో వివాదం ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే 44 పరుగుల తేడాతో యూఏఈని చిత్తు చేసిన నేపాల్ టైటిల్‌ను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ (102) సెంచరీతో మెరవగా, గుల్సన్ ఝా (52) అర్థసెంచరీ సాధించాడు. యూఏఈ బౌలర్లలో ఇబ్రార్ అహ్మద్ 4 వికెట్లు తీయగా, కుజైమా తన్వీర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 49.1 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (100 నాటౌట్) సెంచరీ చేయగా, షోయబ్ ఖాన్ (52) హాఫ్ సెంచరీ సాధించాడు. నేపాల్ బౌలర్లలో కరన్ కేసీ 3 వికెట్లు తీయగా, లలిత్ రజ్‌బన్షీ రెండు వికెట్లు పడగొట్టాడు.
🚨 This is the El Clásico of Associate Nations, baby! 🥶
Another heated argument between Nepal and UAE in the final of the ACC Men’s Premier Cup 2026! pic.twitter.com/Rd0QAPca78— Sports Janta Party (@SportJantaParty) September 12, 2026
ఇదీ చదవండి: ఫుట్‌బాల్ చరిత్రలో విచిత్రమైన గోల్ అంటే ఇదే!


