‘బెంచ్‌ మీద ఉండలేను.. దానికి నేను వ్యతిరేకం’ | No One Wants To Sit On Bench: Arjun Tendulkar After Mumbai Indians Exit | Sakshi
Sakshi News home page

‘బెంచ్‌ మీద ఉండటం ఇష్టం లేదు.. దానికి నేను వ్యతిరేకం’

Apr 1 2026 4:31 PM | Updated on Apr 1 2026 4:50 PM

No One Wants To Sit On Bench: Arjun Tendulkar After Mumbai Indians Exit

అర్జున్‌ టెండుల్కర్‌ (PC: MI)

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో తొలుత సొంత జట్టు ముంబైకి ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. ఆ తర్వాత గోవాకు మారిపోయాడు. అయినప్పటికీ 26 ఏళ్ల అర్జున్‌ టెండుల్కర్‌ ఇంతవరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

తండ్రి సచిన్‌ పదహారేళ్లకే భారత జట్టులో అరంగేట్రం చేసి.. లెక్కకు మిక్కిలి రికార్డులు సాధిస్తే.. అర్జున్‌ టీమిండియా ఇప్పటికీ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ అతడికి అవకాశాలు కరువయ్యాయి.

ఐదు మ్యాచ్‌లు ఆడి..
సచిన్‌ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌ జట్టుతో చాలాకాలం కొనసాగిన అర్జున్‌ టెండుల్కర్‌ (Arjun Tendulkar).. ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీయగలిగాడు. చివరగా 2024లో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. ఆ తర్వాత మళ్లీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

లక్నో సూపర్‌ జెయింట్స్‌లోకి
ఈ క్రమంలో 2026 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ అర్జున్‌ టెండుల్కర్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026లో భాగంగా లక్నో బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుండగా.. అర్జున్‌కు తుదిజట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో శుభంకర్‌ మిశ్రా పాడ్‌కాస్ట్‌కు హాజరైన అర్జున్‌ టెండుల్కర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ముంబై ఇండియన్స్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడారు కదా! మీరు బాగా బౌలింగ్‌ చేశారు. స్వింగ్‌ కూడా బాగుంది. కాబట్టి మరికొన్ని అవకాశాలకు మీరు అర్హులు అని భావించారా?’’ అని హోస్ట్‌ అర్జున్‌ టెండుల్కర్‌ను అడిగాడు.

బెంచ్‌ మీద కూర్చోవాలని ఎవరు కోరుకుంటారు?
ఇందుకు బదులిస్తూ.. ‘‘ఎవరైనా సరే అలాగే ఫీలవుతారు. బెంచ్‌ మీద కూర్చోవాలని ఎవరికి మాత్రం ఆశగా ఉంటుంది. అయితే, అవకాశం వచ్చినపుడు కఠినంగా శ్రమించి అద్భుతంగా ఆడటం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది’’ అని అర్జున్‌ టెండుల్కర్‌ పేర్కొన్నాడు. 

అదే విధంగా ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌పై అభిప్రాయం పంచుకుంటూ.. పదకొండు మంది ఆటగాళ్లతోనే తుదిజట్టు ఉంటే బాగుంటుందని అర్జున్‌ పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానైతే ఇంపాక్ట్‌ సబ్‌ నిబంధనకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు.

చదవండి: సిరాజ్‌ జట్టులో ఎందుకున్నట్లు?.. టీమిండియా దిగ్గజం

Advertisement
 
Advertisement
Advertisement