ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్ ముంగిపునకు వచ్చింది. ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా తమ చివరి టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టి.. ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి చేసుకుంది.
పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. తదుపరి అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్‌లో మూడో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత జట్టు.. మెల్‌బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో దారుణంగా విఫలమైంది. ఆతిథ్య జట్టు చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం
ఫలితంగా ఆసీస్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో నిలవగా.. రోహిత్ సేన డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. ఆస్ట్రేలియాకు మార్గం సుగమమైంది. ఏదేమైనా ఆసీస్‌లో టీమిండియా వైఫల్యం కొనసాగుతున్నప్పటికీ ఓ ఆణిముత్యం లాంటి ఆటగాడు దొరకడం సానుకూలాంశం.
నితీశ్ రెడ్డి.. ఆణిముత్యం లాంటి ఆటగాడు
అతడు మరెవరో కాదు.. నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy). ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తొలి టెస్టు నుంచే బ్యాట్ ఝులిపిస్తున్నాడు. మెల్‌బోర్న్ టెస్టులో ఏకంగా శతకం(114)తో సత్తా చాటాడు. తద్వారా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అత్యంత పిన్న వయసులోనే సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా 21 ఏళ్ల నితీశ్ రెడ్డి చరిత్ర సృష్టించాడు.
ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డి టీమిండియా టెస్టు జట్టుతో పాతుకుపోవడం ఖాయమంటూ భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టెస్టుల తర్వాత.. టీమిండియా 2025లో తొలుత ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది.
నితీశ్ రెడ్డితో పాటు అతడినీ ఎంపిక చేయండి!
అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి చేసుకుని.. జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నితీశ్ రెడ్డితో పాటు ఇంగ్లండ్ టూర్‌కు మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
‘‘మెల్‌బోర్న్ టెస్టు భారత క్రికెట్‌కు అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్‌ను ఇచ్చింది.. అతడి పేరు నితీశ్ కుమార్ రెడ్డి. ఐపీఎల్‌లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ తరఫున అదరగొట్టడం ద్వారా భారత క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడు.. నిజానికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అంత గొప్ప ఏమీ ఆడలేదు.
క్రెడిట్ మొత్తం వారికే
అయినప్పటికీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. అతడి బృందం నితీశ్ రెడ్డిపై నమ్మకం ఉంచినందుకు వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. సెలక్టర్ల నమ్మకాన్ని ఈ అబ్బాయి నిలబెట్టుకున్నాడు. ఇక మరో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer)పై కూడా సెలక్టర్లు దృష్టి సారించాలి.
అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం మరో సానుకూలాంశం. అయితే, బౌలింగ్ నైపుణ్యాలను కాస్త మెరుగుపరచుకోవాలి. అతడికి ఇప్పటికే ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి అక్కడ అతడు టెస్టుల్లో రాణించగలడు’’ అని సునిల్ గావస్కర్ స్పోర్ట్స్ స్టార్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.
కౌంటీల్లో ఆడిన వెంకటేశ్
కాగా 2024లో ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లంకాషైర్‌కు ప్రాతినిథ్యం వహించాడు వెంకటేశ్ అయ్యర్. మూడు మ్యాచ్‌లు ఆడి 116 పరుగులు చేశాడు. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన వెంకటేశ్ అయ్యర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. అదే విధంగా అంతర్జాతీయ టీ20లలో ఐదు వికెట్లు తీయగలిగాడు.
చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?
Comments
Please login to add a commentAdd a comment