కివీస్‌ పేసర్‌ భారీ హిట్టింగ్‌.. క్రిస్‌ గేల్‌ సిక్సర్ల రికార్డు సమం | NZ vs ENG: Tim Southee Equals Chris Gayle Six Hitting Record in Farewell Test | Sakshi
Sakshi News home page

కివీస్‌ పేసర్‌ భారీ హిట్టింగ్‌.. క్రిస్‌ గేల్‌ సిక్సర్ల రికార్డు సమం

Published Sun, Dec 15 2024 12:11 PM | Last Updated on Sun, Dec 15 2024 12:43 PM

NZ vs ENG: Tim Southee Equals Chris Gayle Six Hitting Record in Farewell Test

తన కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్‌ సీనియర్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో వెస్టిండీస్‌ విధ్వంసక వీరుడు క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న రికార్డును సౌథీ సమం చేశాడు. కివీస్‌ జట్టు సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతోంది.

మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే
ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.

లాథమ్‌, సాంట్నర్‌ ఫిఫ్టీలు
హామిల్టన్‌లోని సెడాన్‌ పార్కులో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌తో శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (135 బంతుల్లో 63; 9 ఫోర్లు), మిచెల్‌ సాంట్నర్‌ (54 బంతుల్లో 50 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.

మరోవైపు.. మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (44; 9 ఫోర్లు), విల్‌ యంగ్‌ (42; 10 ఫోర్లు) రాణించారు. అయితే, ఒక దశలో 172/2తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్‌... మిడిలార్డర్‌ వైఫల్యంతో 231/7కు పరిమితమైంది. రచిన్‌ రవీంద్ర (18), డరైన్‌ మిషెల్‌ (14), టామ్‌ బ్లన్‌డెల్‌ (21), గ్లెన్‌ ఫిలిప్స్‌ (5) విఫలమయ్యారు.

చెలరేగిన సౌథీ
మరికాసేపట్లో ఇన్నింగ్స్‌ ముగియడం ఖాయమే అనుకుంటున్న దశలో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ సాంట్నర్‌ చెలరేగాడు. ఈ మ్యాచ్‌తో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకనున్న టిమ్‌ సౌథీ (10 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా దుమ్ము రేపడంతో న్యూజిలాండ్‌ మూడొందల మార్కు దాటగలిగింది. 

వీరిద్దరి ధాటికి కివీస్‌ టి20 తరహాలో చివరి 8 ఓవర్లలో 76 పరుగులు రాబట్టడం విశేషం. ఇంగ్లండ్‌ బౌలర్లలో మాథ్యూ పాట్స్, గస్‌ అట్కిన్‌సన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

టెస్టు క్రికెట్‌లో భారీ సిక్స్‌లకు పెట్టింది పేరైన సౌథీ
కాగా టెస్టు క్రికెట్‌లో భారీ సిక్స్‌లకు పెట్టింది పేరైన సౌథీ ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో... క్రిస్‌ గేల్‌ (98 సిక్స్‌లు)తో సమంగా నాలుగో స్థానానికి చేరాడు. 

ఈ జాబితాలో ఉన్నది వీరే
ఈ జాబితాలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (133 సిక్స్‌లు) అగ్ర స్థానంలో ఉండగా... న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (107 సిక్స్‌లు), ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (100 సిక్స్‌లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.

ఇక టీమిండియా నుంచి వీరేంద్ర సెహ్వాగ్‌ (91 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (88 సిక్స్‌లు) ఈ జాబితాలో వరుసగా ఆరో, ఏడో స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌ తరఫున 107వ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న సౌథీ... ఇంగ్లండ్‌తో సిరీస్‌ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.

ఇంగ్లండ్‌ 143 ఆలౌట్‌
ఆదివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కివీస్‌ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 143 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌ ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ కంటే 340 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.

చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్‌ హెడ్‌ వరల్డ్‌ రికార్డు.. సరికొత్త చరిత్ర
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement