న్యూజిలాండ్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించడం ద్వారా టెస్ట్‌ల్లో 30 సెంచరీల మార్కును (97 మ్యాచ్‌ల్లో) తాకాడు. ఈ ఘనత సాధించే క్రమంలో దిగ్గజ ఆటగాళ్లు డాన్ బ్రాడ్‌మన్, విరాట్ కోహ్లిల రికార్డులను అధిగమించాడు.
టెస్ట్‌ల్లో బ్రాడ్‌మన్ (52 టెస్ట్‌లు), విరాట్ కోహ్లి (113 టెస్ట్‌లు) 29 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో కేన్ వీరిద్దరిని దాటాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో కేన్, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్‌తో (137 మ్యాచ్‌లు) సమానంగా 30 సెంచరీలు కలిగి ఉన్నాడు. యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక టెస్ట్ సెంచరీ రికార్డు స్టీవ్ స్మిత్ పేరిట ఉంది. స్మిత్ ఇప్పటివరకు 32 సెంచరీలు (107 టెస్ట్‌ల్లో) చేశాడు.
అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీల రికార్డు (యాక్టివ్ క్రికెటర్లలో) విరాట్ కోహ్లి పేరిట ఉంది. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 80 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44), కేన్ విలియమ్సన్ (43) విరాట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా కొనసాగుతున్న కేన్.. గత 9 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు చేయడం విశేషం.
ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో కేన్ విలియమ్సన్‌తో (112) పాటు వన్డే వరల్డ్‌కప్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర (118) కూడా సెంచరీతో కదంతొక్కాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ అజేయ శతకాలతో ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. న్యూజిలాండ్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 258 పరుగులుగా ఉంది.
ఓపెనర్లు టామ్ లాథమ్ (20), డెవాన్ కాన్వే (1) ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మొరేకీ, ప్యాటర్సన్ తలో వికెట్ పడగొట్టారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసింది.
Comments
Please login to add a commentAdd a comment