
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఉప్పల్ వేదికగా సెప్టెంబర్ 25న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగిన నాటి నుంచి హెచ్‌సీఏపై వివిధ అంశాలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహారుద్దీన్ పదవీకాలానికి సంబంధించి మరో కేసు నమోదైంది.
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహారుద్దీన్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 26తోనే ముగిసినప్పటికీ.. అతను తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి చేసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు బృందం రాచకొండ సీపీ మహేష్ భగవత్‌కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు లిఖితపూర్వరంగా సీపీకి కంప్లైంట్‌ను అందజేశారు.
పదవీకాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసుకున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 18న జరిగే బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్‌కు హాజరు అయ్యేందుకు అజహారుద్దీన్ తన పదవీకాలాన్ని పొడిగించుకున్నాడని ఆరోపించారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని సీపీకి కంప్లైంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment