వెస్టిండీస్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్(Pakistan Vs West Indies) శుభారంభం చేసింది. వరుస విరామాల్లో వికెట్లు కూల్చి పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాకిస్తాన్ బౌలర్ల దెబ్బకు విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది.
ఈ క్రమంలో ఇరుజట్ల ముల్తాన్‌లో జనవరి 17- 21 వరకు జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య పాక్ ఘన విజయం సాధించింది. విండీస్‌ను ఏకంగా 127 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక అదే వేదికపై శనివారం రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
విండీస్ బ్యాటర్లకు చుక్కలు
అయితే, పాకిస్తాన్ స్పిన్నర్లు ఆది నుంచే విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్ మికైల్ లూయిస్(4)ను కశిఫ్ అలీ(Kashif Ali) పెవిలియన్‌కు పంపగా.. సాజిద్ ఖాన్(Sajid Khan) వన్‌డౌన్ బ్యాటర్ ఆమిర్ జాంగూ(0)ను రెండో వికెట్‌గా వెనక్కి పంపాడు.
నొమన్ అలీ సరికొత్త చరిత్ర
ఈ క్రమంలో పదో ఓవర్‌లో తన వికెట్ల వేట మొదలుపెట్టిన నొమన్ అలీ(Noman Ali) తొలుత కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్(9)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం సాజిద్ ఖాన్ అథనాజ్(0) ను అవుట్ చేయగా.. నొమన్ అలీ మరోసారి యాక్షన్‌లోకి దిగాడు.
విండీస్ ఇన్నింగ్స్‌లో పన్నెండో ఓవర్ మొదటి బంతి నుంచే చెలరేగిన ఈ వెటరన్ స్పిన్నర్ వరుస బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్(1), టెవిన్ ఇమ్లాచ్(0), కెవిన్ సిన్‌క్లెయిర్(0)లను అవుట్ చేశాడు. ఇలా హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన 38 ఏళ్ల నొమన్ అలీ.. సరికొత్త చరిత్ర సృష్టించాడు.
పాకిస్తాన్ తరఫున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన తొలి స్పిన్నర్‌గా నొమన్ అలీ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో పాక్ బౌలర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు వసీం అక్రం, అబ్దుల్ రజాక్, మొహ్మద్ సమీ, నసీం షా ఈ ఫీట్ నమోదు చేశారు.
పాకిస్తాన్ తరఫున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్లు
వసీం అక్రం- 1999లో శ్రీలంకపై లాహోర్ వేదికగా
వసీం అక్రం- 1999లో శ్రీలంకపై ఢాకా వేదికగా
అబ్దుల్ రజాక్- 2000లో శ్రీలంకపై గాలే వేదికగా
నసీం షా- 2020లో బంగ్లాదేశ్‌పై రావల్పిండి వేదికగా
నొమన్ అలీ- 2025లో వెస్టిండీస్ ముల్తాన్ వేదికగా..
163 పరుగులకు ఆలౌట్
ఇక పాక్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే ఆలౌట్ అయింది. టెయిలెండర్ గుడకేశ్ మోటీ(55) అర్ధ శతకంతో చెలరేగగా.. కేమార్ రోచ్(25), జామెల్ వారికన్(36 నాటౌట్) రాణించారు. టాప్, మిడిలార్డర్‌లో కలిపి కేవెం హాడ్జ్(21) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment