Pak vs Eng: చెలరేగిన పాక్‌ స్పిన్నర్లు.. ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం | PAK Vs ENG 3rd Test: Noman Strikes 6 Wickets England 112 Unwanted Record, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

PAK Vs ENG: చెలరేగిన పాక్‌ స్పిన్నర్లు.. ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం

Published Sat, Oct 26 2024 12:32 PM | Last Updated on Sat, Oct 26 2024 1:30 PM

Pak vs Eng 3rd Test: Noman Strikes 6 Wickets England 112 Unwanted Record

Pakistan vs England, 3rd Test Day 3: పాకిస్తాన్‌తో రావల్పిండి టెస్టులో ఇంగ్లండ్‌ చెత్త ప్రదర్శన కనబరిచింది. సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్‌ అయింది. పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు 2021లో అబుదాబి వేదికగా 72 పరుగులకే కుప్పకూలింది.

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా ఇంగ్లండ్‌ మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లండ్‌ గెలుపొందగా.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఆతిథ్య పాక్‌ రెండో మ్యాచ్‌లో జయభేరి మోగించింది.

ఆరు వికెట్లతో చెలరేగిన నొమన్‌ అలీ
మూడో టెస్టులోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 267 పరుగులకే కట్టడి చేసిన షాన్‌ మసూద్‌ బృందం.. రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్‌ చేసింది. పాక్‌ స్పిన్నర్లు నొమన్‌ అలీ, సాజిద్‌ ఖాన్‌ ధాటికి తట్టుకోలేక ఇంగ్లిష్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.

నొమన్‌ ఆరు వికెట్లతో చెలరేగగా.. సాజిద్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జో రూట్‌ 33 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హ్యారీ బ్రూక్‌ 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ 12 పరుగులకే వెనుదిరిగాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విధించిన 36 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్‌ నష్టపోయి ఛేదించిన పాకిస్తాన్‌ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.  

రెండో రోజు ఆట ఇలా సాగింది
బ్యాటర్ల పట్టుదలకు, బౌలర్ల సహకారం తోడవడంతో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో పాకిస్తాన్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. సిరీస్‌ నిర్ణయాత్మక పోరులో పాకిస్తాన్‌ ప్లేయర్లు సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.

ఇక అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 73/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ 96.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్‌ ప్లేయర్‌ సౌద్‌ షకీల్‌ (223 బంతుల్లో 134; 5 ఫోర్లు) వీరోచిత సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్ల దాడిని సమర్థంగా ఎదుర్కొన్న షకీల్‌ బౌండరీల జోలికి పోకుండా ఒకటి, రెండు పరుగులు చేస్తూ ముందుకు సాగాడు. 

ఆఖర్లో స్పిన్‌ ద్వయం నోమాన్‌ అలీ (45; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌), సాజిద్‌ ఖాన్‌ (48 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాకిస్తాన్‌కు 77 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (26), వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ (25) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. సల్మాన్‌ ఆఘా (1) విఫలమయ్యాడు. 

సహనానికి పరీక్షగా మారిన స్లో పిచ్‌పై దాదాపు ఐదు గంటలకు పైగా క్రీజులో నిలిచిన షకీల్‌... నోమాన్‌ అలీ, సాజిద్‌ తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రేహాన్‌ అహ్మద్‌ 4, షోయబ్‌ బషీర్‌ మూడు వికెట్లు పడగొట్టారు.

చదవండి: Ind vs NZ: రోహిత్‌ శర్మ మరోసారి ఫెయిల్‌.. నీకేమైంది ’హిట్‌మ్యాన్‌’?!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement