రావల్పిండి: బ్యాటింగ్‌లో సమష్టి ప్రదర్శన... బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది (5/49), వహాబ్ రియాజ్ (4/41) కచ్చితత్వం... వెరసి తొలి వన్డేలో జింబాబ్వేపై పాకిస్తాన్ 26 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ 1–0తో ముందంజ వేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 281 పరుగులు సాధించింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (75 బంతుల్లో 58; 6 ఫోర్లు), హారిస్ సొహైల్ (82 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు.
చివర్లో ఇమాద్ వసీమ్ (26 బంతుల్లో 34 నాటౌట్; ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో పాక్ స్కోరు 280 దాటింది. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ, చిసోరో రెండేసి వికెట్లు పడగొట్టారు. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.4 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ (117 బంతుల్లో 112; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీ చేసినా కీలకదశలో అవుటవ్వడం జింబాబ్వే విజయావకాశాలపై ప్రభావం చూపింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ టేలర్ ఐదో వికెట్‌కు మాధెవెరె (61 బంతుల్లో 55; 7 ఫోర్లు)తో 119 పరుగులు జోడించాడు. తొమ్మిది బంతుల వ్యవధిలో షాహిన్, రియాబ్ వీరిద్దరిని పెవిలియన్‌కు పంపించడంతో జింబాబ్వే కోలుకోలేకపోయింది. రెండో వన్డే ఇదే వేదికపై ఆదివారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment