super league
-
కివీస్ చేతిలో ఓటమి.. వరల్డ్‌కప్ రేసు నుంచి శ్రీలంక ఔట్..!
ఆక్లాండ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 198 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. పరుగుల పరంగా శ్రీలంకపై కివీస్‌కు ఇది అతి పెద్ద విజయం. ఈ గెలుపుతో న్యూజిలాండ్ వరల్డ్‌కప్ సూపర్ లీగ్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా క్వాలిఫై కావాలన్న శ్రీలంక ఆశలు ఆవిరయ్యాయి. శ్రీలంకతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేస్తే ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ న్యూజిలాండ్ అగ్రస్థానానికి చేరుకుంటుంది. వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా న్యూజిలాండ్ ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో ఫలితం రాకపోగా.. 15 గెలిచి, ఐదింటిలో ఓడింది. దీంతో ఆ జట్టు ఖాతాలోకి 160 పాయింట్లు చేరాయి. New Zealand have topped the @MRFWorldwide ICC Men’s @cricketworldcup Super League table 💥#NZvSL report 👇https://t.co/PyjYWvuA3G — ICC (@ICC) March 25, 2023 న్యూజిలాండ్ తర్వాత ఇంగ్లండ్ (155), ఇండియా (139), బంగ్లాదేశ్ (130), పాకిస్తాన్ (130), ఆస్ట్రేలియా (120), ఆఫ్ఘనిస్తాన్ (112) వరుసగా 2 నుంచి 7 స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్‌కప్-2023కు ఈ 7 జట్లు నేరుగా క్వాలిఫై కాగా.. మిగిలిన మరో స్థానం కోసం శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌లు పోటీపడుతున్నాయి. సీజన్ ముగిసే సమయానికి 8వ స్థానంలో ఉండే జట్టు నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. తొలి వన్డేలో కివీస్ చేతిలో భారీ పరాజయం చవిచూసిన నేపథ్యంలో శ్రీలంక 10వ స్థానానికి పడిపోయి వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఒకవేళ లంకేయులు కివీస్‌పై రెండు, మూడు వన్డేల్లో గెలిచినా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ ఛాన్సస్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం స్టాండింగ్స్‌లో ఉన్న 9వ స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. త్వరలో నెదర్లాండ్స్‌తో జరుగబోయే రెండు వన్డేల్లో విజయం సాధిస్తే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం శ్రీలంకతో పాటు 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్, 11వ స్థానంలో ఉన్న ఐర్లాండ్ కూడా వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా కోల్పోయాయి. ఒకవేళ సౌతాఫ్రికా వరల్డ్‌కప్‌కు నేరుగా క్వాలిఫై అయితే వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లు జింబాబ్వే, నెదర్లాండ్స్ తదితర జట్లతో కలిసి క్వాలిఫయర్ పోటీల్లో తలపడాల్సి ఉంటుంది. ఈ పోటీలు జూన్ 8న మొదలవుతాయి. -
IND vs SA 2nd ODI: సిరీస్ కాపాడుకునేందుకు...
రాంచీ: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఎంతో చేరువగా వచ్చినా, త్రుటిలో గెలుపు అవకాశం చేజార్చుకున్న భారత జట్టు ఇప్పుడు దానిని సరిదిద్దుకోవాలని పట్టుదలతో ఉంది. మరో మ్యాచ్‌లో ఓడి సిరీస్ కోల్పోరాదని భావిస్తున్న టీమిండియా నేడు జరిగే రెండో వన్డేలో బరిలోకి దిగుతోంది. టాప్ ఆటగాళ్లు లేకుండా ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతోనే మైదానంలోకి అడుగు పెట్టిన భారత్‌కు సంబంధించి వన్డే సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా... దక్షిణాఫ్రికాకు మాత్రం వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించేందుకు ప్రతీ మ్యాచ్ గెలుపు ద్వారా లభించే 10 ‘సూపర్ లీగ్’ పాయింట్లు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరు ఖాయం. పేస్ బౌలర్ దీపక్ చహర్ వెన్ను నొప్పితో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కాగా, అతని స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తొలి వన్డేలోనూ చహర్ బరిలోకి దిగలేదు. షహబాజ్‌కు అవకాశం దక్కేనా! 40 ఓవర్లకు కుదించిన మొదటి వన్డేలో భారత్ కేవలం 9 పరుగులతో ఓడింది. ఇన్నింగ్స్ చివర్లో సామ్సన్‌కు మరికొన్ని బంతులు ఆడే అవకాశం వచ్చి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో. కాబట్టి ఓవరాల్‌గా చూస్తే అదే జట్టును కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మన బ్యాటింగ్ బృందంలో సామ్సన్ తన సత్తా ఏమిటో చూపించగా, శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు తాను సరైనవాడినని నిరూపించుకున్నాడు. అయితే గత మ్యాచ్‌లో విఫలమైన టాప్–4 ఈసారి ఎలా ఆడతారన్నది చూడాలి. ఓపెనర్లు ధావన్, గిల్ ప్రభావం చూపించాల్సి ఉండగా... తొలి వన్డేలో మరీ పేలవంగా ఆడిన రుతురాజ్, ఇషాన్ కిషన్‌లు ఏమాత్రం రాణిస్తారనేది కీలకం. ఆల్‌రౌండర్ శార్దుల్ రెండు విధాలా ఆకట్టుకోవడం సానుకూలాంశం. కుల్దీప్ యాదవ్ కూడా మరోసారి తన భిన్నమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించగలడు. అయితే రెండో స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ స్థానంలో షహబాజ్ అహ్మద్‌కు చాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. షహబాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున అరంగేట్రం చేయలేదు. ఇద్దరు పేసర్లు అవేశ్, సిరాజ్ మరోసారి కొత్త బంతిని పంచుకోవడం ఖాయం. ఇటీవల వన్డేల్లో ఎంతో మెరుగుపడిన సిరాజ్, చివరి ఓవర్లలో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం సానుకూలాంశం. చహర్ స్థానంలో ఎంపికైన సుందర్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు. రెండు మార్పులతో... వన్డే సూపర్ లీగ్ పాయింట్లలో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 11వ స్థానంలో కొనసాగుతోంది. నేరుగా అర్హత సాధించేందుకు టాప్–8లో నిలవాల్సి ఉండగా ఆ జట్టుకు ప్రతీ వన్డే కీలకం కానుంది. రెండో వన్డేతో పాటు చివరి మ్యాచ్‌లో కూడా గెలిస్తేనే జట్టు పరిస్థితి మెరుగవుతుంది. అయితే లక్నో మ్యాచ్‌లోనూ అదృష్టవశాత్తూ గెలిచిన ఆ జట్టు మరో విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరం. పూర్తి స్థాయి జట్టే అందుబాటులో ఉన్నా, భారత్‌ను ఓడించేందుకు సఫారీ టీమ్ తీవ్రంగా శ్రమించింది. ఇలాంటి స్థితిలో జట్టులో అందరూ రాణించాల్సి ఉంది. కెప్టెన్ బవుమా జట్టుకు పెద్ద బలహీనతగా మారగా, ఆల్‌రౌండర్ మార్క్రమ్ గత కొంత కాలంగా వన్డేల్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. మలాన్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రూపంలో చెప్పుకోదగ్గ ఓపెనర్లు ఉండటం కాస్త నయం. గత మ్యాచ్‌లోనూ వీరిద్దరు శుభారంభం అందించగా, ఆ తర్వాత టీమ్ తడబడింది. మిల్లర్, క్లాసెన్ ఆదుకోవడంతో పరిస్థితి మెరుగైంది. మరోసారి ఈ జోడీపై దక్షిణాఫ్రికా అమితంగా ఆధారపడుతోంది. ఆల్‌రౌండర్ ప్రిటోరియస్ గాయంతో దూరం కావడం జట్టు సమతుల్యతను దెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో జట్టులో రెండు మార్పులు కనిపిస్తున్నాయి. వేన్ పార్నెల్, షమ్సీ స్థానాల్లో మరో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జాన్సెన్, ఫెలుక్వాయోలకు అవకాశం దక్కవచ్చు. రబడ, కేశవ్ మహరాజ్ ప్రభావం చూపిస్తుండగా... ఇన్‌గిడి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ఇక్కడ జరిగిన ఐదు వన్డేల్లో నాలుగింటిలో భారీ స్కోర్లే నమోదయ్యాయి. బౌలర్లూ ఎప్పుడూ ప్రభావం చూపలేకపోయారు. మ్యాచ్ రోజు కొన్ని చినుకులు పడే అవకాశం ఉన్నా... ఆటకు అంతరాయం కలగకపోవచ్చు. -
Ned Vs WI: చెలరేగిన తేజ నిడమనూరు.. అయినా వెస్టిండీస్ చేతిలో తప్పని ఓటమి!
Netherlands Vs West Indies ODI Series: ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సిరీస్‌తో విండీస్ పరిమిత ఓవర్ల క్రికెట్ సారథిగా ప్రయాణం ఆరంభించిన నికోలస్ పూరన్‌కు మధుర జ్ఞాపకంగా మిగిలింది. కాగా మూడు వన్డేల సిరీస్ ఆడే నిమిత్తం వెస్టిండీస్ జట్టు తొలిసారిగా నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం వీఆర్ఏ క్రికెట్ స్టేడియం వేదికగా తొలి వన్డే జరిగింది. వరణుడి ఆటంకం కారణంగా మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. ఇందులో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌కు ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్(47 పరుగులు), మాక్స్ ఒడౌడ్(39 పరుగులు) శుభారంభం అందించారు. ఆ తర్వాత తక్కువ స్కోర్లకే బ్యాటర్లు పరిమితమైనప్పటికీ.. తేజా నిడమనేరు 58 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 45 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి నెదర్లాండ్స్ 240 పరుగులు చేసింది. అయితే, ఇందుకు ధీటుగా బదులిచ్చిన వెస్టిండీస్ 43.1 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ షాయీ హోప్ 119 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. బ్రూక్స్ 60, బ్రాండన్ కింగ్ 58 పరుగులు సాధించారు. కెప్టెన్ నికోలస్ పూరన్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. 11 బంతుల్లో కేవలం 7 పరుగులు చేశాడు. ఈ వరణుడి కారణంగా డీఎల్ఎస్ మెథడ్‌లో నిర్వహించిన మొదటి వన్డేలో విజయంతో విండీస్ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. చదవండి: IPL 2022: పర్పుల్ క్యాప్ హోల్డర్ చహల్, హసరంగ కూడా ఆ చెత్త జాబితాలో! 🎯 DLS Target 247 for the West Indies to win. https://t.co/9gJVlLVl0f — Cricket🏏Netherlands (@KNCBcricket) May 31, 2022 -
బ్రెండన్ టేలర్ సెంచరీ వృథా
రావల్పిండి: బ్యాటింగ్‌లో సమష్టి ప్రదర్శన... బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది (5/49), వహాబ్ రియాజ్ (4/41) కచ్చితత్వం... వెరసి తొలి వన్డేలో జింబాబ్వేపై పాకిస్తాన్ 26 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ 1–0తో ముందంజ వేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 281 పరుగులు సాధించింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (75 బంతుల్లో 58; 6 ఫోర్లు), హారిస్ సొహైల్ (82 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. చివర్లో ఇమాద్ వసీమ్ (26 బంతుల్లో 34 నాటౌట్; ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో పాక్ స్కోరు 280 దాటింది. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ, చిసోరో రెండేసి వికెట్లు పడగొట్టారు. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.4 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ (117 బంతుల్లో 112; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీ చేసినా కీలకదశలో అవుటవ్వడం జింబాబ్వే విజయావకాశాలపై ప్రభావం చూపింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ టేలర్ ఐదో వికెట్‌కు మాధెవెరె (61 బంతుల్లో 55; 7 ఫోర్లు)తో 119 పరుగులు జోడించాడు. తొమ్మిది బంతుల వ్యవధిలో షాహిన్, రియాబ్ వీరిద్దరిని పెవిలియన్‌కు పంపించడంతో జింబాబ్వే కోలుకోలేకపోయింది. రెండో వన్డే ఇదే వేదికపై ఆదివారం జరుగుతుంది. -
ఐర్లాండ్ సూపర్...
ఎప్పుడో ఐదున్నరేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐర్లాండ్ విజయం సాధించింది. ఆ తర్వాత పెద్ద జట్లతో తలపడిన 26 మ్యాచ్‌లలో 24 సార్లు పరాజయమే ఎదురవగా, రెండింటిలో ఫలితం తేలలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఐర్లాండ్‌కు చెప్పుకోదగ్గ గెలుపు దక్కింది. అదీ ప్రపంచ చాంపియన్‌పై! ఇంగ్లండ్ చేతిలో తొలి రెండు మ్యాచ్‌లలో ఓడి సిరీస్ కోల్పోయిన అనంతరం ఐర్లాండ్ మూడో వన్డేలో తమ ప్రతాపం చూపించింది. అసాధ్యమనుకున్న భారీ లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది. అయితే ప్రపంచకప్ కోసం జరుగుతున్న ఈ సూపర్ లీగ్‌లో 2–1తో నెగ్గిన ఇంగ్లండ్ ఖాతా తెరిచింది. సౌతాంప్టన్: భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి ముగిసిన మూడో వన్డేలో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ సాధించగా, టామ్ బాంటన్ (51 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ విల్లీ (42 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం ఐర్లాండ్ 49.5 ఓవర్లలో 3 వికెట్లకు 329 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పాల్ స్టిర్లింగ్ (128 బంతుల్లో 142; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ ఆండీ బల్బర్నీ (112 బంతుల్లో 113; 12 ఫోర్లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 214 పరుగులు జోడించారు. ఇంగ్లండ్‌పై ఐర్లాండ్‌కు వన్డేల్లో ఇది రెండో విజయం కాగా... నాడు 2011 ప్రపంచకప్‌లో కూడా దాదాపు ఇదే తరహా స్కోర్లు నమోదు (327, 329) కావడం విశేషం. -
ఇంగ్లండ్ శుభారంభం
సౌతాంప్టన్: వన్డే ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ కొత్తగా మొదలైన ఐసీసీ ‘క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్’లో శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ విల్లీ (5/30) పేస్ ధాటికి ఐర్లాండ్ 44.4 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న కర్టిస్ క్యాంఫర్ (118 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, ఆండీ మెక్‌బ్రైన్ (48 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం ఇంగ్లండ్ 27.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. స్యామ్ బిల్లింగ్స్ (54 బంతుల్లో 67 నాటౌట్; 11 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు 96 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అంతకు ముందు తొలి ఓవర్లోనే స్టిర్లింగ్ (2) వికెట్ కోల్పోయిన ఐర్లాండ్ ఇన్నింగ్స్ ఆ తర్వాత కుప్పకూలింది. 7 ఓవర్లలోపే కేవలం 28 పరుగులకు జట్టు 5 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో క్యాంఫర్ జట్టును ఆదుకున్నాడు. కెవిన్ ఓబ్రైన్ (22)తో ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించిన అతను మెక్బ్రైన్తో ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జత చేశాడు. సాఖిబ్ మహమూద్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్ కూడా తక్కు వ వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయినా... బిల్లింగ్స్, మోర్గాన్ భాగస్వామ్యంతో విజయం వైపు మళ్లింది. రెండో వన్డే ఇదే మైదానంలో రేపు జరుగుతుంది. -
‘వరల్డ్ కప్ సూపర్ లీగ్’ వచ్చేసింది...
లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తరహాలో వన్డేల్లో కూడా పాయింట్ల పద్ధతిలో టోర్నీ తీసుకురావాలని భావించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ ప్రణాళికను అమల్లోకి తీసుకొస్తోంది. గతంలోనే ప్రకటించి కరోనా కారణంగా కాస్త వెనక్కి తగ్గినా... ఇప్పుడు టోర్నీ జరగడం ఖాయమైంది. ఈ నెల 30నుంచి ఈ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ‘క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ ’ పేరుతో జరిగే ఈ ఈవెంట్... టి20ల మెరుపులతో ప్రభ తగ్గుతున్న వన్డే క్రికెట్‌ను సజీవంగా నిలబెట్టగలదని ఐసీసీ ఆశిస్తోంది. వరల్డ్ కప్ సూపర్ లీగ్ నిర్వహణపై సందేహాలు ఉండటంతో కొంత కాలం క్రితం ఈ టోర్నీపై ప్రణాళిక రూపొందించి కూడా ఐసీసీ వెనక్కి తగ్గింది. కోవిడ్–19 నేపథ్యంలో పలు టోర్నీలు, సిరీస్‌లు రద్దు కావడంతో ఇది సాధ్యమయ్యేలా కనిపించలేదు. అయితే 2023 ఫిబ్రవరి–మార్చిలో జరగాల్సిన వన్డే వరల్డ్ కప్ అక్టోబర్–నవంబర్‌కు వాయిదా పడి తగినంత సమయం లభించడంతో ఐసీసీ మళ్లీ దీనిపై దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. టోర్నీ ఎప్పటినుంచి... జూలై 30 నుంచి ఇంగ్లండ్–ఐర్లాండ్ మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్‌తో వరల్డ్ కప్ సూపర్ లీగ్ మొదలవుతుంది. ఇందులో భాగంగా జులై 30, ఆగస్టు 1, ఆగస్టు 4 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. పాల్గొనే జట్లు మొత్తం 13 టీమ్‌లు సూపర్ లీగ్‌లో ఆడతాయి. ర్యాంకింగ్ ప్రకారం టాప్–12 జట్లతో పాటు 2015–17 ఐసీసీ వరల్డ్ క్రికెట్ సూపర్ లీగ్ విజేతగా నిలిచిన నెదర్లాండ్స్ 13వ జట్టు. టోర్నీ ఫార్మాట్ వచ్చే మూడేళ్లలోగా నిర్ణీత సమయంలో (ఇంకా కటాఫ్ తేదీ ఖరారు కాలేదు) ప్రతీ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లు కనీసం ఎనిమిది (నాలుగు ఇంటా, నాలుగు బయట ప్రాతిపదికన) ఆడుతుంది. గెలిచిన జట్టుకు 10 పాయింట్లు, డ్రా, టై లేదా రద్దు అయితే 5 పాయింట్లు లభిస్తాయి. తర్వాత ఏమిటి... పాయింట్లపరంగా టాప్–7లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. వీటికి తోడు ఆతిథ్య దేశంగా భారత్‌కు ఇప్పటికే అవకాశం లభించింది. భారత్ టాప్–7లో ఉంటే ఎనిమిదో టీమ్‌కు చాన్స్ దక్కుతుంది. మిగిలిన జట్లు ఏం చేస్తాయి... నేరుగా క్వాలిఫై కాని 5 టీమ్‌లు, మరో 5 అసోసియేట్ జట్లతో కలిసి వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2023 టోర్నీ ఆడతాయి. ఇందులో టాప్–2 జట్లు మాత్రమే ముందంజ వేస్తాయి. మిగిలిన 8 సహా మొత్తం 10 జట్లతో వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. మూడో కంటికే ‘నోబాల్’ వన్డేలు, టి20ల్లో ఫీల్డ్ అంపైర్ల పాత్రను మరింత తగ్గించే దిశగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో అడుగు వేసింది. కొత్త నిబంధన ప్రకారం ఇకపై ఫ్రంట్ ఫుట్ నోబాల్‌లను పర్యవేక్షించే అ«ధికారం పూర్తిగా థర్డ్ అంపైర్లకే అప్పజెప్పారు. సాధారణంగా ఫీల్డ్ అంపైర్లే నో బాల్‌ను ప్రకటిస్తారు. అయితే కొన్నాళ్ల క్రితం భారత్–వెస్టిండీస్ సిరీస్‌లో అదనంగా మూడో అంపైర్ కూడా ఒక కన్నేసి ఉంచేలా ప్రయోగాత్మకంగా పరిశీలించారు. సాంకేతికంగా అది సరైనదిగా అనిపించడంతో ఇప్పుడు పూర్తిగా ‘మూడో కంటి’కే ఈ నిర్ణయాధికారం కట్టబెట్టారు. ఇకపై ఫీల్డ్ అంపైర్లు ఫ్రంట్ ఫుట్ నోబాల్ ప్రకటించడానికి వీల్లేదు. జూలై 30 నుంచి జరిగే ఇంగ్లండ్, ఐర్లాండ్ వన్డే సిరీస్‌తో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. మరో వైపు వన్డే సూపర్ లీగ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కూడా శిక్షను కఠినతరం చేశారు. ఇప్పటి వరకు విధిస్తున్న జరిమానా కాకుండా ఒక ఓవర్ ఆలస్యమైతే ఒక పాయింట్ కోత విధించాలని ఐసీసీ నిర్ణయించింది. -
హోరాహోరీగా వాలీబాల్ టోర్నీ
అనంతపురం సప్తగిరిసర్కిల్ : రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు రెండోరోజైన శనివారం హోరాహోరీగా సాగాయి. స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీలు సూపర్‌లీగ్ దశకు చేరుకున్నాయి. పామిడి, వైఎస్సార్ కడప, సంజీవరెడ్డి స్టేడియం జట్టు, అనంతపురం మెడికల్ జట్లు లీగ్ స్థాయి పోటీల్లో గెలిచి సూపర్‌లీగ్‌కు చేరుకున్నాయి. సూపర్‌లీగ్ మ్యాచ్‌లు శనివారం సాయంత్రం, ఆదివారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొండారెడ్డి తెలిపారు. పోటీలకు సీఐలు సాయిప్రసాద్, రియాజ్, తబ్రేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆదివారం టోర్నీ ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొండారెడ్డి తెలిపారు. పోటీలకు మనోహర్‌రెడ్డి, జబీర్, గౌడ్, నసీమాబాను, ప్రవీణ్‌కుమార్, రమేష్, రామాంజినేయులు, సురేష్, నరేష్ రెఫరీలుగా వ్యవహరించారు. లీగ్ మ్యాచ్ వివరాలు.. - డీఎస్ఏ అనంతపురం జట్టును 25–21, 18–25, 15–6 (2–1) తేడాతో అనంతపురం మెడికల్ జట్టు ఓడించింది. - నెల్లూరు జట్టుపై 18–25, 25–20, 15–12 (2–1) తేడాతో వైఎస్సార్ కడప జట్టు గెలిచింది. - కర్నూలుపై 21–25, 25–23, 15–10 (2–1) తేడాతో వైఎస్సార్ కడప జట్టు విజయం సాధించింది. - చిత్తూరు జట్టును 25–17, 25–16 (2–0)తేడాతో పామిడి జట్టు ఓడించింది. - ఎస్ఆర్ స్టేడియం జట్టు 25–17, 25–16 (2–0) తేడాతో నార్పల జట్టును ఓడించింది. - చిత్తూరుపై ప్రకాశం 32–30, 25–18(2–0) తేడాతో గెలిచింది. సూపర్‌లీగ్ పోటీలు.. - పామిడిపై అనంతపురం మెడికల్ జట్టు 25–14, 25–20 (2–0) తేడాతో విజయం సాధించింది. - వైఎస్సార్ కడప జట్టుతో మ్యాచ్‌లో 24–26, 25–23, 15–13 (2–1) తేడాతో ఎస్ఆర్ స్టేడియం జట్టు గెలిచింది.