సౌతాంప్టన్: వన్డే ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ కొత్తగా మొదలైన ఐసీసీ ‘క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్’లో శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ విల్లీ (5/30) పేస్ ధాటికి ఐర్లాండ్ 44.4 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న కర్టిస్ క్యాంఫర్ (118 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, ఆండీ మెక్‌బ్రైన్ (48 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం ఇంగ్లండ్ 27.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది.
స్యామ్ బిల్లింగ్స్ (54 బంతుల్లో 67 నాటౌట్; 11 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు 96 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అంతకు ముందు తొలి ఓవర్లోనే స్టిర్లింగ్ (2) వికెట్ కోల్పోయిన ఐర్లాండ్ ఇన్నింగ్స్ ఆ తర్వాత కుప్పకూలింది. 7 ఓవర్లలోపే కేవలం 28 పరుగులకు జట్టు 5 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో క్యాంఫర్ జట్టును ఆదుకున్నాడు. కెవిన్ ఓబ్రైన్ (22)తో ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించిన అతను మెక్‌బ్రైన్‌తో ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జత చేశాడు. సాఖిబ్ మహమూద్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్ కూడా తక్కు వ వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయినా... బిల్లింగ్స్, మోర్గాన్ భాగస్వామ్యంతో విజయం వైపు మళ్లింది. రెండో వన్డే ఇదే మైదానంలో రేపు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment