
ఆండీ బల్‌బర్నీ
ఎప్పుడో ఐదున్నరేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐర్లాండ్ విజయం సాధించింది. ఆ తర్వాత పెద్ద జట్లతో తలపడిన 26 మ్యాచ్‌లలో 24 సార్లు పరాజయమే ఎదురవగా, రెండింటిలో ఫలితం తేలలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఐర్లాండ్‌కు చెప్పుకోదగ్గ గెలుపు దక్కింది.
అదీ ప్రపంచ చాంపియన్‌పై! ఇంగ్లండ్ చేతిలో తొలి రెండు మ్యాచ్‌లలో ఓడి సిరీస్ కోల్పోయిన అనంతరం ఐర్లాండ్ మూడో వన్డేలో తమ ప్రతాపం చూపించింది. అసాధ్యమనుకున్న భారీ లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది. అయితే ప్రపంచకప్ కోసం జరుగుతున్న ఈ సూపర్ లీగ్‌లో 2–1తో నెగ్గిన ఇంగ్లండ్ ఖాతా తెరిచింది.
సౌతాంప్టన్: భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి ముగిసిన మూడో వన్డేలో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ సాధించగా, టామ్ బాంటన్ (51 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ విల్లీ (42 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించారు.
అనంతరం ఐర్లాండ్ 49.5 ఓవర్లలో 3 వికెట్లకు 329 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పాల్ స్టిర్లింగ్ (128 బంతుల్లో 142; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ ఆండీ బల్‌బర్నీ (112 బంతుల్లో 113; 12 ఫోర్లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 214 పరుగులు జోడించారు. ఇంగ్లండ్‌పై ఐర్లాండ్‌కు వన్డేల్లో ఇది రెండో విజయం కాగా... నాడు 2011 ప్రపంచకప్‌లో కూడా దాదాపు ఇదే తరహా స్కోర్లు నమోదు (327, 329) కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment