రాంచీ: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఎంతో చేరువగా వచ్చినా, త్రుటిలో గెలుపు అవకాశం చేజార్చుకున్న భారత జట్టు ఇప్పుడు దానిని సరిదిద్దుకోవాలని పట్టుదలతో ఉంది. మరో మ్యాచ్‌లో ఓడి సిరీస్ కోల్పోరాదని భావిస్తున్న టీమిండియా నేడు జరిగే రెండో వన్డేలో బరిలోకి దిగుతోంది. టాప్ ఆటగాళ్లు లేకుండా ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతోనే మైదానంలోకి అడుగు పెట్టిన భారత్‌కు సంబంధించి వన్డే సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా... దక్షిణాఫ్రికాకు మాత్రం వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించేందుకు ప్రతీ మ్యాచ్ గెలుపు ద్వారా లభించే 10 ‘సూపర్ లీగ్’ పాయింట్లు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరు ఖాయం. పేస్ బౌలర్ దీపక్ చహర్ వెన్ను నొప్పితో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కాగా, అతని స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తొలి వన్డేలోనూ చహర్ బరిలోకి దిగలేదు.
షహబాజ్‌కు అవకాశం దక్కేనా!
40 ఓవర్లకు కుదించిన మొదటి వన్డేలో భారత్ కేవలం 9 పరుగులతో ఓడింది. ఇన్నింగ్స్ చివర్లో సామ్సన్‌కు మరికొన్ని బంతులు ఆడే అవకాశం వచ్చి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో. కాబట్టి ఓవరాల్‌గా చూస్తే అదే జట్టును కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మన బ్యాటింగ్ బృందంలో సామ్సన్ తన సత్తా ఏమిటో చూపించగా, శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు తాను సరైనవాడినని నిరూపించుకున్నాడు. అయితే గత మ్యాచ్‌లో విఫలమైన టాప్–4 ఈసారి ఎలా ఆడతారన్నది చూడాలి.
ఓపెనర్లు ధావన్, గిల్ ప్రభావం చూపించాల్సి ఉండగా... తొలి వన్డేలో మరీ పేలవంగా ఆడిన రుతురాజ్, ఇషాన్ కిషన్‌లు ఏమాత్రం రాణిస్తారనేది కీలకం. ఆల్‌రౌండర్ శార్దుల్ రెండు విధాలా ఆకట్టుకోవడం సానుకూలాంశం. కుల్దీప్ యాదవ్ కూడా మరోసారి తన భిన్నమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించగలడు. అయితే రెండో స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ స్థానంలో షహబాజ్ అహ్మద్‌కు చాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. షహబాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున అరంగేట్రం చేయలేదు. ఇద్దరు పేసర్లు అవేశ్, సిరాజ్ మరోసారి కొత్త బంతిని పంచుకోవడం ఖాయం. ఇటీవల వన్డేల్లో ఎంతో మెరుగుపడిన సిరాజ్, చివరి ఓవర్లలో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం సానుకూలాంశం. చహర్ స్థానంలో ఎంపికైన సుందర్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు.
రెండు మార్పులతో...
వన్డే సూపర్ లీగ్ పాయింట్లలో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 11వ స్థానంలో కొనసాగుతోంది. నేరుగా అర్హత సాధించేందుకు టాప్–8లో నిలవాల్సి ఉండగా ఆ జట్టుకు ప్రతీ వన్డే కీలకం కానుంది. రెండో వన్డేతో పాటు చివరి మ్యాచ్‌లో కూడా గెలిస్తేనే జట్టు పరిస్థితి మెరుగవుతుంది. అయితే లక్నో మ్యాచ్‌లోనూ అదృష్టవశాత్తూ గెలిచిన ఆ జట్టు మరో విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరం. పూర్తి స్థాయి జట్టే అందుబాటులో ఉన్నా, భారత్‌ను ఓడించేందుకు సఫారీ టీమ్ తీవ్రంగా శ్రమించింది. ఇలాంటి స్థితిలో జట్టులో అందరూ రాణించాల్సి ఉంది. కెప్టెన్ బవుమా జట్టుకు పెద్ద బలహీనతగా మారగా, ఆల్‌రౌండర్ మార్క్‌రమ్ గత కొంత కాలంగా వన్డేల్లో ఘోరంగా విఫలమవుతున్నాడు.
మలాన్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రూపంలో చెప్పుకోదగ్గ ఓపెనర్లు ఉండటం కాస్త నయం. గత మ్యాచ్‌లోనూ వీరిద్దరు శుభారంభం అందించగా, ఆ తర్వాత టీమ్ తడబడింది. మిల్లర్, క్లాసెన్ ఆదుకోవడంతో పరిస్థితి మెరుగైంది. మరోసారి ఈ జోడీపై దక్షిణాఫ్రికా అమితంగా ఆధారపడుతోంది. ఆల్‌రౌండర్ ప్రిటోరియస్ గాయంతో దూరం కావడం జట్టు సమతుల్యతను దెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో జట్టులో రెండు మార్పులు కనిపిస్తున్నాయి. వేన్ పార్నెల్, షమ్సీ స్థానాల్లో మరో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జాన్సెన్, ఫెలుక్‌వాయోలకు అవకాశం దక్కవచ్చు. రబడ, కేశవ్ మహరాజ్ ప్రభావం చూపిస్తుండగా... ఇన్‌గిడి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ఇక్కడ జరిగిన ఐదు వన్డేల్లో నాలుగింటిలో భారీ స్కోర్లే నమోదయ్యాయి. బౌలర్లూ ఎప్పుడూ ప్రభావం చూపలేకపోయారు. మ్యాచ్ రోజు కొన్ని చినుకులు పడే అవకాశం ఉన్నా... ఆటకు అంతరాయం కలగకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment