వన్డే ప్రపంచకప్-2023 కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన పాకిస్తాన్‌కు ఐసీసీ బిగ్ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించారు. నిర్ధేశిత సమయం పూర్తియ్యే సరికి పాకిస్తాన్ తమ కోటా ఓవర్ల కంటే రెండు ఓవర్లు వెనుకపడి ఉండటంతో ఐసీసీ ఈ ఫైన్ విధించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా నేరాన్ని అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ కోత విధుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్‌పై డక్‌వర్త్ లూయిస్ (డీఎల్‌ఎస్) పద్ధతి ప్రకారం 21 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. ఈ విజయంతో పాక్ తమ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. మొదట కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది.
రచిన్ రవీంద్ర (108; 15 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీలో మూడో సెంచరీ సాధించగా, గాయంనుంచి కోలుకొని బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్ (79 బంతుల్లో 95; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. తర్వాత పాకిస్తాన్ కష్టమైన లక్ష్యం వైపు ధాటిగా దూసుకెళ్లింది. వానతో మ్యాచ్ నిలిచేసరికి 25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది.
అప్పటి డక్‌వర్త్ లూయిస్ లెక్కల ప్రకారం మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పాక్ 21 పరుగులు ముందంజలో ఉంది. దీంతో పాక్‌ను విజేతగా నిర్ణయించారు. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 125 నాటౌట్, 8 ఫోర్లు, 11 సిక్స్‌లు) సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ సాధించాడు. కెప్టెన్ బాబర్ అజమ్ (63 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment