Photo Credit: Twitter
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన పాకిస్తాన్ జట్టు ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పాకిస్తాన్ సున్నా పరుగు వద్దే తొలి వికెట్‌ను కోల్పోవడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో ఓలి రాబిన్‌సన్ బౌలింగ్‌లో అజన్ అవైస్ డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో ఇమామ్-ఉల్-హక్ సున్నా పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఈ క్రమంలో 149 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నా పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోవడం పాక్‌కు ఇది ఏడోసారి. ఈ నేపథ్యంలో అత్యధిక సార్లు సున్నా పరుగుల వద్ద వికెట్ కోల్పోయిన చెత్త జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. పాక్ తర్వాత ఇంగ్లండ్ (5 సార్లు), ఆస్ట్రేలియా (4 సార్లు), భారత్ (రెండు సార్లు), న్యూజిలాండ్ ఒకసారి ఈ ఫీట్‌ను నమోదు చేశాయి.
ఇక ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓటమి వల్ల డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ, భారత్‌కు మాత్రం కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌కు ఇది ఐదో ఓటమి. కేవలం 19.05 శాతం పాయింట్లతో పాక్ 9వ స్థానానికి దిగజారింది.
దీంతో వెస్టిండీస్ (20.83 శాతం పాయింట్లు) 8వ స్థానంలో నిలవగా, పాక్‌పై విజయంతో ఇంగ్లాండ్ 29.76 శాతం పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇరు జట్లు ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు ఆస్ట్రేలియా 77.78 శాతం పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా (75 శాతం), న్యూజిలాండ్ (72.22 శాతం) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
ప్రస్తుతం భారత్ 53.33 శాతం పాయింట్లతో 5వ స్థానంలో, బంగ్లాదేశ్ 66.67 శాతం పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాయి. శ్రీలంకపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ రెండో మ్యాచ్‌లోనూ గెలిచి, అటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఓడిపోతే, భారత్ 57.57 శాతం పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోవడంతో ఫైనల్ రేసుకు మరింత దగ్గరయినట్లవుతుంది.
ఇక హెడ్డింగే వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 171 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకు ఆలౌట్ కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 135 పరుగులకే కుప్పకూలింది.
జోఫ్రా ఆర్చర్, ఒల్లీ రాబిన్సన్, జోష్ టంగ్, గుస్ అట్కిన్సన్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు నిలవలేకపోయారు. రాబిన్సన్, టంగ్‌లు చెరో 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తద్వారా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 27నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది.
Read: స్టార్క్ దెబ్బకు బంగ్లాదేశ్ విలవిల.. 149 ఏళ్లలో ఇదే తొలిసారి


