న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాడు. ఫైనల్ పోటీలో నీరజ్ 87.58 మీటర్లు విసిరి స్వర్ణం కైవసం చేసుకోగా.. వడ్లెచ్ 86.67 మీటర్లు, వాస్లీ 85.44 మీటర్లు విసిరి వరుసగా రజతం, కాంస్యం గెలుచుకున్నారు. వీరి తరువాత జర్మన్‌కు చెందిన వెబర్ నాలుగో స్థానంలో, పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ అర్షద్ (84.62 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో నీరజ్‌తో పోటీపడి ఐదో స్థానంలో నిలిచిన పాక్ అథ్లెట్ నదీమ్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇందులో నదీమ్.. భారత బల్లెం యోధుడు, స్వర్ణ పతకం విజేత, నా ఐడల్ నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు.. సారీ పాకిస్తాన్ నేను మీ కొరకు పతకం గెలవలేక పోయాను అంటూ పేర్కొన్నాడు. ఫైనల్ ముగిసిన కాసేపటికే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రాను తమ దేశ అథ్లెట్ అర్షద్ నదీమ్ ‘ఐడల్’ గా పేర్కొనడంపై పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంటే ఒక ఏడాది చిన్నవాడైన నీరజ్‌ను ఐడల్‌గా పేర్కొనడం ఏంటనీ విమర్శించారు.
అయితే, అసలు విషయం ఏంటంటే.. ఆ ట్విట్టర్ అకౌంట్ నకిలీదని, సయీద్ అన్వర్ అనే వ్యక్తి నదీమ్ పేరిట ట్వీట్లు చేశాడని ట్విటర్ అధికారులు గుర్తించారు. అనంతరం ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. కాగా, అంతకుముందు 2018 ఏషియన్ గేమ్స్‌లో వీరిద్దరి షేక్ హ్యాండ్ విషయం వైరల్ అయ్యింది. నీరజ్ అప్పుడు కూడా స్వర్ణం గెలవగా.. అర్షద్ నదీమ్ కాంస్య పతకంతో సరిపుచ్చుకున్నాడు. పతకాలు బహుకరించిన తర్వాత నదీమ్, నీరజ్ తమ దేశ జెండాలను భుజంపై వేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అప్పట్లో వైరల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment