అంటాల్యా (టర్కీ): టాప్–4లో నిలిచి దర్జాగా పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించాలనుకున్న భారత మహిళల ఆర్చరీ జట్టుకు నిరాశ ఎదురైంది. చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో దీపిక కుమారి, అంకిత, భజన్ కౌర్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది.
భారత జట్టు 3–5 (51–51, 55–52, 53–54, 52–54)తో వెరోనికా, అనస్తాసియా, ఒలాలతో కూడిన ఉక్రెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ టోరీ్నలో సెమీఫైనల్‌కు చేరిన చైనా, చైనీస్ తైపీ, మలేసియా, బ్రిటన్ జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.
క్వాలిఫయింగ్ టోర్నీ లో ఓడినప్పటికీ భారత జట్టుకు వరల్డ్ ర్యాంకింగ్ ద్వారా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందే చివరి అవకాశం మిగిలి ఉంది. ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ ముగిశాక ఈనెల 24న ప్రపంచ ర్యాంకింగ్స్ విడుదల చేస్తారు.
ఇప్పటికీ ఒలింపిక్స్‌కు అర్హత పొందని రెండు ఉత్తమ ర్యాంక్ జట్లకు ‘పారిస్’ బెర్త్‌లు ఖరారవుతాయి. ఇప్పటి వరకు ఫ్రాన్స్, జర్మనీ, కొరియా, మెక్సికో, నెదర్లాండ్స్, అమెరికా, చైనా, చైనీస్ తైపీ, మలేసియా, బ్రిటన్ జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. చివరి రెండు బెర్త్‌లను వరల్డ్ ర్యాంకింగ్ ద్వారా ఖరారు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment