ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది ఓసారి జరిగే ఈ సిరిస్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు.
యాషెస్ సిరీస్ తర్వాత ఆత్యధిక ఫాలోయింగ్ ఉండే సిరీస్ ఇదే. ఈసారి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుండటం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
చివరగా 1991-92లో ఆసీస్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరిగింది. గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు ఈసారి భారత్‌పై ఎలాగైనా టెస్టు సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆసీస్ భావిస్తోంది.
కమ్మిన్స్ కీలక నిర్ణయం..
ఈ క్రమంలో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్వదేశంలో టీమిండియాతో టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని కమ్మిన్స్ ఎనిమిది వారాల పాటు బౌలింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు.
తొలుత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నద్దమయ్యేందుకు దేశీవాళీ క్రికెట్‌లో కమ్మిన్స్ ఆడనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతుండడంతో దేశీవాళీ టోర్నీకు దూరంగా ఉండాలని కమ్మిన్స్ భావిస్తున్నాడు.
"దాదాపుగా 18 నెలల (ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్) నుంచి కంటిన్యూగా బౌలింగ్ చేస్తున్నాను. బాగా ఆలిసిపోయాను. ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏడు నుంచి ఎనిమిది వారాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నాను.
తద్వారా నా శరీరానికి పూర్తి విశ్రాంతి లభిస్తుంది. అయితే జిమ్‌లో మాత్రం నా సాధనను నేను కొనసాగిస్తాను. ఇప్పటివరకు నా కెరీర్‌లో గెలవని ట్రోఫీ ఎదైనా ఉందంటే అది బీజీటీనే. నేనే కాదు జట్టులో చాలా మంది ఆటగాళ్లు కూడా ఈ ట్రోఫీని ముద్దాడలేదని" ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమ్మిన్స్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment