
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు (Champions Trophy 2025) ముందు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు (Australia) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా మెగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. తొలుత మిచెల్ మార్ష్ (Mitchel Marsh).. తాజాగా ఫాస్ట్ బౌలర్లు కమిన్స్ (Pat Cummins), జోష్ హాజిల్‌వుడ్ (Josh Hazzlewood) ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది.
ఈ మధ్యలో ఆస్ట్రేలియాకు మరో ఊహించని షాక్ కూడా తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) అనూహ్యంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా మొత్తం నలుగురు ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. ఈ నలుగురికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ప్రకటించాల్సి ఉంది. రేసులో కూపర్ కన్నోలీ, బ్యూ వెబ్‌స్టర్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్ ముందువరసలో ఉన్నారు.
కాగా, ఆస్ట్రేలియా ప్రస్తుతం రెండు టెస్ట్‌లు, రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో ఇదివరకే తొలి టెస్ట్ పూర్తి కాగా.. ఇవాళే (ఫిబ్రవరి 6) రెండో టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
టీ విరామం సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (11), దిముత్ కరుణరత్నే (36), ఏంజెలో మాథ్యూస్ (1), కమిందు మెండిస్ (13), ధనంజయ డిసిల్వ (0) ఔట్ కాగా.. దినేశ్ చండీమల్ (70), కుసాల్ మెండిస్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 3, మిచెల్ స్టార్క్, ట్రవిస్ హెడ్ తలో వికెట్ పడగొట్టారు.
తొలి టెస్ట్‌లో ఆసీస్ భారీ విజయం
తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.
ఫిబ్రవరి 12 నుంచి వన్డేలు.. ఆతర్వాత నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకే..!
ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్‌కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆసీస్ జట్టు (ముందుగా ప్రకటించింది)
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
Comments
Please login to add a commentAdd a comment