ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు (Champions Trophy) ముందు ఆస్ట్రేలియాకు (Australia) అతి భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) మెగా టోర్నీకి దూరం కానున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ పరోక్షంగా వెల్లడించాడు. కమిన్స్ కాలి మడమ సమస్యతో బాధపడుతున్నట్లు మెక్‌డొనాల్డ్ చెప్పాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరమైన పక్షంలో ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఆసీస్ కెప్టెన్సీ రేసులో ఉంటారని మెక్‌డొనాల్డ్ అన్నాడు. కమిన్స్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ పాల్గొనడం లేదు. అతని భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనందున లంక సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. టెస్ట్ జట్టులో లేని సభ్యులు లంకతో వన్డే సిరీస్ కోసం ఇవాళ ఆస్ట్రేలియా నుంచి బయల్దేరాల్సి ఉంది. ఈ బృందంలో కమిన్స్ లేడు.
మరోవైపు మెక్‌డొనాల్డ్ మరో ఆసీస్ పేసర్ గాయంపై కూడా కీలక అప్‌డేట్ ఇచ్చాడు. గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే వైదొలిగిన జోష్ హాజిల్‌వుడ్ ఫిట్‌నెస్ సాధించేందుకు పోరాడుతున్నాడని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజిల్‌వుడ్ కూడా అనుమానమే అని మెక్‌డొనాల్డ్ పరోక్షంగా వెల్లడించాడు.
కొద్ది రోజుల ముందే ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి వైదొలిగాడు. ఇప్పుడు కమిన్స్, హాజిల్‌వుడ్ కూడా మెగా టోర్నీకి దూరమైతే ఆ జట్టు విజయావకాశాలు పూర్తి స్థాయిలో దెబ్బతింటాయి. మార్ష్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా ప్రకటించలేదు.
బ్యూ వెబ్‌స్టర్ మార్ష్‌కు బదులు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో యాడ్ అవుతాడని కోచ్ మెక్‌డొనాల్డ్ అన్నాడు. పై ముగ్గురితో పాటు ఆసీస్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్న మరికొందరు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఆల్‌రౌండర్లు మార్కస్ స్టోయినిస్, ఆరోన్ హార్డీ గాయాల బారిన పడ్డ ఆటగాళ్ల జాబితాలో ఉన్నారని సమాచారం.
కాగా, ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం రెండు టెస్ట్‌లు, రెండు వన్డేల సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో తొలుత టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందటే తొలి టెస్ట్ ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాలో ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ సిరీస్‌లో ఆసీస్‌కు స్టీవ్ స్మిత్ సారథ్యం వహిస్తున్నాడు (కమిన్స్ గైర్హాజరీలో). తొలి టెస్ట్‌లో స్మిత్ కెప్టెన్సీలో సత్తా చాటడమే కాకుండా వ్యక్తిగతంగానూ రాణించాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్ (141) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్‌లో ఆసీస్ వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ తన అరంగేట్రం టెస్ట్‌లోనే శతక్కొట్టి శభాష్ అనిపించుకున్నాడు.
ఆసీస్, శ్రీలంక మధ్య రెండో టెస్ట్ రేపటి నుంచి (ఫిబ్రవరి 6) ప్రారంభమవుతుంది. అనంతరం ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్‌కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆసీస్ జట్టు..
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
Comments
Please login to add a commentAdd a comment