ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణంగా భారత బ్యాటర్ల వైఫల్యమే అని చెప్పవచ్చు. ఇక ఆటలో గెలుపోటములు సహజం కాబట్టి.. టీమిండియా తదుపరి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లపై దృష్టి సారించనుంది.
ఇప్పటికే ఆస్ట్రేలియాను వీడిన టీమిండియా స్టార్లలో కొందరు.. స్వదేశంలో అడుగుపెట్టగానే దేశీ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రసిద్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లలో భాగం కానున్నట్లు సమాచారం.
కేఎల్ రాహుల్‌కు విశ్రాంతి
అయితే, కేఎల్ రాహుల్‌ను కూడా ఈ టోర్నీలో ఆడాలని యాజమాన్యం సూచించగా.. అతడు తనకు విశ్రాంతి కావాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. దేవ్‌దత్ పడిక్కల్ పెర్త్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.
నిరాశపరిచిన పడిక్కల్
అయితే, తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై పూర్తిగా నిరాశపరిచిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత మళ్లీ అతడు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం సంపాదించలేకపోయాడు.
వాషీకే పెద్దపీట
ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు మాత్రం ఈ సిరీస్‌లో ప్రాధాన్యం దక్కింది. రవిచంద్రన్ అశ్విన్‌ను కాదని మరీ.. టీమిండియా మేనేజ్‌మెంట్ వాషీ వైపు మొగ్గుచూపింది. అందుకు తగ్గట్లుగానే వాషీ రాణించాడు. అవసరమైన వేళ బ్యాట్ ఝులిపించడంతో పాటు వికెట్లు తీయడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు ఈ చెన్నై చిన్నోడు.
ప్రసిద్ హిట్
అయితే, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు పేస్ దళంలో ఆకాశ్ దీప్‌తో పోటీలో వెనుకబడ్డ ప్రసిద్ కృష్ణకు ఆఖరి టెస్టులో అవకాశం వచ్చింది. సిడ్నీ టెస్టుకు ముందు ఆకాశ్ దీప్ గాయపడిన కారణంగా.. ప్రసిద్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఆరు వికెట్లు తీసి.. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు ఈ కర్ణాటక యువ పేసర్.
నాకౌట్ మ్యాచ్‌ల బరిలో
ఇక పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ తదుపరి ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లపై కూడా కన్నేశారు. సీనియర్లు విశ్రాంతి పేరిట దూరమయ్యే పరిస్థితుల నేపథ్యంలో అవకాశాన్ని ఒడిసిపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లలో ఆడేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా గురువారం (జనవరి 9) నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రి క్వార్టర్ పైనల్ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. తమిళనాడు, రాజస్తాన్, హర్యానా, బెంగాల్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. మరోవైపు.. అద్భుత ప్రదర్శనతో టాప్-6లో నిలిచిన గుజరాత్, విదర్భ, కర్ణాటక, బరోడా, మహారాష్ట్ర, పంజాబ్ నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి.
ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు
ఈ నేపథ్యంలో తమిళనాడు తరఫున వాషీ, కర్ణాటక తరఫున ప్రసిద్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్ బరిలో దిగనున్నారు. ఇదిలా ఉంటే.. జనవరి 22 నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య సిరీస్ ఆరంభం కానుంది. తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్‌లు జరుగుతాయి.
చదవండి: ‘బవుమా అలాంటి వాడు కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’
Comments
Please login to add a commentAdd a comment