పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్‌లో కరాచీ కింగ్స్ బోణీ కొట్టింది. ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన కింగ్స్ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. లహోర్ ఖలందర్స్‌తో నిన్న (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ 67 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. ఓపెనర్లు మాథ్యూ వేడ్ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్స్), జేమ్స్ విన్స్ (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ ఇమాద్ వసీం (19 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. లాహోర్ బౌలర్లలో కెప్టెన్ షాహీన్ అఫ్రిది, జమాన్ ఖాన్, హరీస్ రౌఫ్, లియామ్ డాసన్ తలో వికెట్ పడగొట్టారు. అఫ్రిది వికెట్ పడగొట్టినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్.. కింగ్స్ బౌలర్లు అకీఫ్ జావిద్ (4/28), అమెర్ యామిన్ (2/18), బెన్ కట్టింగ్ (2/12), మహ్మద్ అమీర్ (1/12) ధాటికి 17.3 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో మీర్జా తాహిర్ బేగ్ (39 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కమ్రాన్ గులామ్ (23), సికందర్ రజా (18), ఫకర్ జమాన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముల్తాన్ సుల్తాన్స్ టాప్‌లో (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు) ఉండగా.. కరాచీ కింగ్స్ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), ఇస్లామాబాద్ యునైటెడ్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), క్వెట్టా గ్లాడియేటర్స్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), పెషావర్ జల్మీ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), లాహోర్ ఖలందర్స్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment