ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ రూపంలో చేతిదాకా వచ్చిన ఐసీసీ టైటిల్‌ను టీమిండియా చేజార్చుకుంది. ఒకసారి అంటే అనుకోవచ్చు.. కానీ వరుసగా రెండోసారి కూడా రన్నరప్‌గా నిలవడం అభిమానులకు రుచించడం లేదు. ఎందుకంటే పదేళ్లుగా టీమిండియా ఖాతాలో ఒక్క ఐసీసీ మేజర్ టైటిల్ లేకుండా పోయింది. ఇక క్రికెట్‌లో మిస్టర్ డిపెండబుల్, ది వాల్ అని పేర్లు కలిగిన రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా వచ్చినప్పటికి పెద్దగా ప్రభావం చూపడం లేదు. కోహ్లి-రవిశాస్త్రి లిగసీని కంటిన్యూ చేయడంలో రోహిత్- ద్రవిడ్‌లు విఫలమయ్యారు.
అయితే కోహ్లి- రవిశాస్త్రి కూడా టీమిండియాకు కప్‌లు అందించింది లేదు కానీ వారిద్దరు ఉన్నప్పుడు జట్టులోకి ఎంతోమంది యువ ఆటగాళ్లు వచ్చారు. కానీ రోహిత్ హయాంలో అలా జరగడం లేదు. కేవలం అనుభవం ఉన్న ప్లేయర్లకు మాత్రమే అవకాశాలు వస్తున్నాయి తప్పితే కొత్త వాళ్లను ప్రోత్సహిస్తున్నట్లు కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మల పదవులకు ఎసరు పెట్టేలా ఉంది.
సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న హయాంలో టీమిండియా దూకుడు మీద కనిపించేది. కెప్టెన్‌గా గంగూలీ ఖాతాలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ మినహా మిగతా టైటిల్స్ లేకపోయినప్పటికి తన అగ్రెసివ్‌నెస్‌తో టీమిండియాకు విదేశాల్లో విజయాలు అందించిన మొదటి కెప్టెన్‌గా పేరు పొందాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంతో పాటు 2003లో సౌతాఫ్రికా గడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను ఫైనల్ చేర్చాడు. ఆ తర్వాత కోచ్ చాపెల్‌తో వివాదం.. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం దాదాను కెప్టెన్సీ కోల్పోయేలా చేసింది. అయితేనేం సౌరవ్ గంగూలీ తన మార్క్‌ను సెట్ చేసి వెళ్లగా దానిని ధోని సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు.
2007లో జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ధోని సేన విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత ధోని కెప్టెన్సీలో మరింత రాటుదేలిన టీమిండియా 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. ఆ తర్వాత 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా అప్పటినుంచి మరో ఐసీసీ టైటిల్ నెగ్గలేదు. అయితే ధోని కెప్టెన్‌గా ఉన్నంతకాలం టీమిండియా సక్సెస్ రేట్ ఎక్కడా తగ్గలేదు.
ఇక ధోని కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత కోహ్లి- రవిశాస్త్రి లిగసీ ప్రారంభమయింది. వీరి హయాంలో టీమిండియా విదేశాల్లో సిరీస్ విజయాలు అందుకోవడం ప్రారంభించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లను వారి సొంతగడ్డపైనే ఓడించింది. అయితే కోహ్లి-రవిశాస్త్రి ఎరాలో టీమిండియా ఒక్క మేజర్ టైటిల్ సాధించలేదు. వీరి తర్వాత కెప్టెన్‌గా బాధ్యత చేపట్టిన రోహిత్.. కోచ్‌గా ద్రవిడ్ ఆ లిగసీని కంటిన్యూ చేయడంలో విఫలమయ్యారు.
ధోని కెప్టెన్సీలో 2011లో వన్డే వరల్డ్‌కప్ సాధించిన టీమిండియా.. అదే ధోని సారధ్యంలో 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ నెగ్గింది. అంతే అప్పటినుంచి ఇప్పటిదాకా పదేళ్లపాటు మరో ఐసీసీ టైటిల్ నెగ్గలేకపోయింది. అయితే ఘోరంగా ఓడిపోతే పర్లేదు.. కానీ 2013 తర్వాత జరిగిన 2014 టి20 వరల్డ్‌కప్‌లో ఫైనల్లో, 2015 వన్డే వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌ల్లో, 2016 టి20 వరల్డ్‌కప్‌లో మళ్లీ సెమీస్‌లో, 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో ఫైనల్లో, 2022 టి20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఇంటిబాట పట్టింది. ఇక 2021, 2023లో జరిగిన డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్‌లోనూ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అంటే దాదాపు ఎనిమిదిసార్లు కప్ కొట్టే అవకాశాన్ని చేజార్చుకున్నట్లే.
Comments
Please login to add a commentAdd a comment