ధర్మశాల: మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ సాంకేతికంగా ఇంకా ‘ప్లే ఆఫ్స్’ రేసులోనే ఉంది. తమ చివరి మ్యాచ్‌లో గెలిచిన ఆ జట్టు 14 పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో నిలిచింది. లీగ్ దశలో తమ పని పూర్తి చేసుకున్న ఆ జట్టు అవకాశాలు ఆదివారం జరిగే మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి. శుక్రవారం జరిగిన పోరులో రాయల్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. స్యామ్ కరన్ (31 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జితేశ్ శర్మ (28 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), షారుఖ్ ఖాన్ (23 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం రాజస్తాన్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దేవదత్ పడిక్కల్ (30 బంతుల్లో 51; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 50; 8 ఫోర్లు), హెట్‌మైర్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) విజయంలో కీలకపాత్ర పోషించారు.
కీలక భాగస్వామ్యాలు...
ఇన్నింగ్స్ రెండో బంతికే ప్రభ్‌సిమ్రన్ (2)ను చక్కటి రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేసి బౌల్ట్ రాజస్తాన్‌కు శుభారంభం అందించగా, కొద్ది సేపటికే పంజాబ్ మరో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 12 పరుగుల వ్యవధిలో అథర్వ తైడే (19), శిఖర్ ధావన్ (17), లివింగ్‌స్టోన్ (9) అవుటయ్యారు. దాంతో స్కోరు 50/4 వద్ద నిలిచింది. ఈ దశలో కరన్‌తో కలిసి జితేశ్ జట్టును ఆదుకున్నాడు. సందీప్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన జితేశ్, ఆ తర్వాత సైనీ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు.
కానీ అదే ఓవర్లో అతను వెనుదిరిగాడు. జితేశ్ అవుటయ్యాక 15 నుంచి 18వ ఓవర్ వరకు 24 బంతుల్లో పంజాబ్ 26 పరుగులే చేయగలిగింది. అయితే చివరి రెండు ఓవర్లలో కరన్, షారుఖ్ మెరుపు బ్యాటింగ్ కారణగా ఆ జట్టు మెరుగైన స్కోరు నమోదు చేయగలిగింది. చహల్ వేసిన 19వ ఓవర్లో ఇద్దరు బ్యాటర్లు కలిసి 3 సిక్స్‌లు, 2 ఫోర్లు సహా 28 పరుగులు రాబట్టగా... బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో మొత్తం 18 పరుగులు వచ్చాయి. వీరిద్దరు ఆరో వికెట్‌కు 37 బంతుల్లో అభేద్యంగా 73 పరుగులు జోడించారు.
సామ్సన్ విఫలం...
జోస్ బట్లర్ ఈ సీజన్‌లో ఐదోసారి ‘డకౌట్’కాగా... యశస్వి, పడిక్కల్ భాగస్వామ్యం రాజస్తాన్‌ను మెరుగైన స్థితికి చేర్చింది. కరన్ వేసిన తొలి ఓవర్లో యశస్వి 3 ఫోర్లు కొట్టగా, రబడ ఓవర్లో పడిక్కల్ వరుసగా 6, 4 బాదడంతో పవర్‌ప్లేలో స్కోరు 57 పరుగులకు చేరింది. 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే పడిక్కల్ వెనుదిరగడంతో 73 పరుగుల (49 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది.
సామ్సన్ (2) ప్రభావం చూపలేకపోగా, 35 బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే గెలుపు దిశగా హెట్‌మైర్‌దే కీలకపాత్ర. ప్రతీ బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ అతను బౌండరీలతో పరుగులు రాబట్టాడు. రబడ ఓవర్లో పరాగ్ (12 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో రాయల్స్ విజయానికి చేరువైంది. 19వ ఓవర్లో ముగిస్తే బెంగళూరు రన్‌రేట్‌ను దాటే అవకాశం ఉండగా... హెట్‌మైర్ అవుట్‌తో అది సాధ్యం కాలేదు. చివరకు మరో రెండు బంతులు మిగిలి ఉండగా రాజస్తాన్ గెలిచింది.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (సి అండ్ బి) బౌల్ట్ 2; ధావన్ (ఎల్బీ) (బి) జంపా 17; అథర్వ (సి) పడిక్కల్ (బి) సైనీ 19; లివింగ్‌స్టోన్ (బి) సైనీ 9; స్యామ్ కరన్ (నాటౌట్) 49; జితేశ్ (సి) (సబ్) ఫెరీరా (బి) సైనీ 44; షారుఖ్ (నాటౌట్) 41; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–2, 2–38, 3–46, 4–50, 5–114. బౌలింగ్: బౌల్ట్ 4–0–35–1, సందీప్ శర్మ 4–0–46–0, సైనీ 4–0– 40–3, జంపా 4–0–26–1, చహల్ 4–0–40–0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) (సబ్) రిషి ధావన్ (బి) ఎలిస్ 50; బట్లర్ (ఎల్బీ) (బి) రబడ 0; పడిక్కల్ (సి) బ్రార్ (బి) అర్ష్ దీప్ 55; సంజూ సామ్సన్ (సి) (సబ్) రిషి ధావన్ (బి) చహర్ 2; హెట్‌మైర్ (సి) శిఖర్ ధావన్ (బి) కరన్ 46; పరాగ్ (సి) అథర్వ (బి) రబడ 20; ధ్రువ్ జురేల్ (నాటౌట్) 10; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–12, 2–85, 3–90, 4–137, 5–169, 6–179. బౌలింగ్: స్యామ్ కరన్ 4–0–46–1, రబడ 4–0–40–2, అర్ష్ దీప్ 4–0–40–1, ఎలిస్ 4–0–34–1, రాహుల్ చహర్ 3.4–0–28–1.
Comments
Please login to add a commentAdd a comment