IPL 2023: Sunil Gavaskar On Playoff Scenario - Sakshi
Sakshi News home page

IPL 2023 Playoffs: ఓటమి వ్యత్యాసం కూడా కీలకమే.. రాజస్తాన్‌ ఆ విషయం మర్చిపోయినట్టుంది!

Published Fri, May 19 2023 11:47 AM | Last Updated on Fri, May 19 2023 12:08 PM

Sunil Gavaskar On IPL 2023 Playoff Scenario - Sakshi

పంజాబ్‌తో కీలక పోరుకు రాజస్తాన్‌ రాయల్స్‌ సన్నద్ధం (PC: IPL/RR)

IPL 2023- PBKS Vs RR: ‘‘మూడు ప్లే ఆఫ్‌ బెర్త్‌ల కోసం ఐదు జట్లు ఇంకా బరిలో ఉన్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోవడంతోపాటు టాప్‌ ర్యాంక్‌తో లీగ్‌ దశను ముగించనుంది. తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ల్లో గెలిస్తే చెన్నై, లక్నో జట్లకు రెండో స్థానంతో లీగ్‌ను ముగించే అవకాశం ఉంది. ఇందులో రన్‌రేట్‌ కూడా ముఖ్యపాత్ర పోషించనుంది.

రన్‌రేట్‌ వ్యత్యాసం వల్ల
అందుకే లీగ్‌ మ్యాచ్‌ల్లో విజయ వ్యత్యాసం కీలకంగా మారింది. బెంగళూరుతో మ్యాచ్‌లో ఈ విషయం రాజస్తాన్‌ మర్చిపోయినట్టుంది. ఒకవేళ రాజస్తాన్‌ లీగ్‌ దశలో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిస్తే రన్‌రేట్‌ వ్యత్యాసం వారి ప్లే ఆఫ్‌ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. టి20 ఫార్మాట్‌లో ఎప్పుడు ఏమి జరుగుతుందో కచ్చితంగా చెప్పలేం.

వికెట్లు పారేసుకున్నారు
అయితే మ్యాచ్‌ చేజారిపోతున్న దశలో ఓటమి వ్యత్యాసం సాధ్యమైనంత తగ్గించేందుకు ఆయా జట్ల బ్యాటర్లు కృషి చేయాలి. కానీ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ బ్యాటర్లు అలా చేయలేదు. క్రీజులో వచ్చిన ప్రతి బ్యాటరు భారీ షాట్‌లకు యత్నించి వికెట్లు పారేసుకున్నారు. రాజస్తాన్‌పై భారీ విజయంతో బెంగళూరుకు ఒక్కసారిగా ప్లే ఆఫ్‌నకు అర్హత పొందే అవకాశాలు పెరిగాయి.

అర్ష్‌దీప్‌ సింగ్‌ తేలిపోయాడు
ఈ అవకాశాన్ని బెంగళూరు ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టుకు ఆడిన అనుభవజ్ఞులైన విదేశీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. గత సీజన్‌లో ఆకట్టుకున్న అర్ష్‌దీప్‌ సింగ్‌ ఈసారి మాత్రం తేలిపోయాడు. అతడిని ఎలా ఎదుర్కోవాలో అన్ని జట్ల బ్యాటర్లకు తెలిసిపోయింది. తాను ఎందుకు విఫలమవుతున్నానో అర్ష్‌దీప్‌ సింగ్‌ తెలుసుకొని మళ్లీ గాడిలో పడాల్సిన అవసరముంది.

భవిష్యత్‌లో భారత్‌ తరఫున  మూడు ఫార్మాట్లలోనూ ఆడే సత్తా అర్ష్‌దీప్‌లో ఉంది. ఢిల్లీతో మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ అద్భుతంగా ఆడినా విజయం మాత్రం దక్కలేదు. అయితే మిగతా ఆటగాళ్లు కూడా పోరాటపటిమను కనబర్చాల్సిన అవసరముంది. మొత్తానికి నాలుగో ప్లే ఆఫ్‌ బెర్త్‌ కోసం ఐపీఎల్‌ లీగ్‌ దశకు అద్భుతమైన ముగింపు లభించనుంది’’ అని టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. కాగా ఐపీఎల్‌-2023 ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే పంజాబ్‌ కింగ్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు అత్యంత కీలకంగా మారింది.

చదవండి: ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్క రియల్‌ కింగ్‌.. అది కోహ్లి మాత్రమే: పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement