దుబాయ్: ఐపీఎల్ 13వ సీజన్ ఆడేందుకు మూడు ఫ్రాంచైజీ జట్లు యూఏఈ చేరుకున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ జట్లు గురువారం చార్టెడ్ ఫ్లయిట్‌లలో దుబాయ్ చేరుకోగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ అబుదాబీలో అడుగుపెట్టింది. యూఏఈ వచ్చే ముందు ఆటగాళ్లందరికి పలుమార్లు కోవిడ్ టెస్టులు చేశారు. ఇప్పుడు వీరిని ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. మళ్లీ ఈ 6 రోజుల్లోనే మూడు సార్లు కరోనా పరీక్షలు చేస్తారు. క్వారంటైన్ తొలి రోజు, మూడో రోజు, ఆఖరి రోజు పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ మూడింటిలో నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారే జీవ రక్షణ వలయం (బయో బబుల్)లోకి వెళ్తారు. ఈ బుడగలో ఉన్నప్పటికీ టోర్నీ జరిగినంత కాలం ప్రతీ ఐదు రోజులకోసారి పరీక్షల తంతు జరుపుతూనే ఉంటారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం దుబాయ్‌కి బయల్దేరతాయి. ఇక మిగతా రెండు ఫ్రాంచైజీలు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వారంతంలోగా యూఏఈ చేరుకునే అవకాశముంది. ఐపీఎల్–13 పోటీలు వచ్చే నెల 19 నుంచి జరగనున్నాయి. మొత్తం 60 మ్యాచ్‌లు 53 రోజుల పాటు దుబాయ్, అబుదాబీ, షార్జా మూడు వేదికల్లో నిర్వహిస్తారు.
హర్భజన్ ఆలస్యంగా...
ఐపీఎల్ మూడు సార్లు విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) పయనానికి సిద్ధమైంది. శుక్రవారం యూఏఈకి బయల్దేరనుంది. అయితే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం జట్టు సభ్యులతో పాటే అక్కడికి వెళ్లడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యంగా వెళ్తాడని సీఎస్‌కే వర్గాలు తెలిపాయి. 40 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ రెండో వారాల్లో జట్టుతో కలుస్తాడని సీఎస్‌కే అధికారి ఒకరు చెప్పారు. నిజానికి భజ్జీ సీఎస్‌కే శిబిరంలోనూ పాల్గొనలేదు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ శార్దుల్ ఠాకూర్‌లు కూడా శిబిరంలో పాల్గొనలేకపోయినా జట్టుతో కలిసారు. ఆటగాళ్లందరికీ మంగళవారం రెండో దశ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ ఫలితాలే వచ్చాయని సీఎస్‌కే అధికారులు తెలిపారు.
బుడగలో ఉన్నవారికి క్వారంటైన్ ఎందుకు?
ఐపీఎల్‌లో ఆడే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు యూఏఈలో క్వారంటైన్ కావాల్సిన అవసరం లేదని రాయల్ చాలెంజర్ బెంగళూరు చైర్మన్ సంజీవ్ చురివాలా తెలిపారు. ఇరు జట్ల ఆటగాళ్లు జీవ రక్షణ వలయంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లు ఆడతారని... బుడగలో ఉన్న క్రికెటర్లకు మళ్లీ క్వారంటైన్ అవసరం ఏముంటుందని సంజీవ్ వ్యాఖ్యానించారు. ఆర్‌సీబీ జట్టులో ఆసీస్ స్టార్ అరోన్ ఫించ్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మొయిన్ అలీ ప్రధాన ఆటగాళ్లు. ఈ నేపథ్యంలో వాళ్లను వచ్చి రాగానే మ్యాచ్‌ల్లో ఆడించాలని ఆలోచనలో ఆర్‌సీబీ ఉంది. విరాట్ కోహ్లి నేతృత్వంలోని బెంగళూరు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షే అయ్యింది. అయితే టైటిల్ లేని లోటు జట్టును వేధిస్తుందని సహజంగానే ఈ ఒత్తిడి తమ ఆటగాళ్లపై ఉంటుందని సంజీవ్ అన్నారు.
తనతో పాటు టెడ్డీకి మాస్క్ పెట్టి రియాన్ పరాగ్
Comments
Please login to add a commentAdd a comment