రాయల్స్‌ రాజసం | Rajasthan Royals beat Chennai Super Kings by 7 wickets | Sakshi
Sakshi News home page

రాయల్స్‌ రాజసం

Published Sun, Oct 3 2021 5:20 AM | Last Updated on Sun, Oct 3 2021 5:20 AM

Rajasthan Royals beat Chennai Super Kings by 7 wickets - Sakshi

అబుదాబి: యశస్వీ జైస్వాల్‌ (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ‘పవర్‌’ గేమ్, శివమ్‌ దూబే (42 బంతుల్లో 64 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ను గెలిపించాయి. ఐపీఎల్‌లో శనివారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో రాయల్స్‌ ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు షాక్‌ ఇచి్చంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది.

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రుతురాజ్‌ గైక్వాడ్‌ (60 బంతుల్లో 101 నాటౌట్‌; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ‘శత’గ్గొడితే... ఆఖర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 32 నాటౌట్‌) చితగ్గొట్టాడు. తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ 17.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసి గెలిచింది. యశస్వీ, దూబే అర్ధసెంచరీలతో చెలరేగారు. వరుసగా నాలుగు విజయాల తర్వాత చెన్నైకిదే తొలి ఓటమి. తాజా గెలుపుతో రాజస్తాన్‌ ‘ప్లే ఆఫ్స్‌’ రేసులో సజీవంగా ఉంది.  

రుతురాజ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌...
చెన్నై ఆట రుతురాజ్‌ బౌండరీతో మొదలైంది. ఆఖరి బంతికి అతడు కొట్టిన సిక్సర్‌తోనే ఇన్నింగ్స్‌ ముగిసింది. జట్టు చేసిన 189 పరుగుల్లో అతనొక్కడే వందకొట్టాడు. డుప్లెసిస్‌ (25; 2 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి తొలి వికెట్‌కు 47 పరుగులు, మొయిన్‌ అలీ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌)తో కలిసి మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. అతని వేగంతో జట్టు 14వ ఓవర్లో 100 పరుగులు దాటింది. గైక్వాడ్‌ 43 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా ఆఖర్లో దూకుడుగా ఆడాడు. ఆఖరి బంతిని సిక్సర్‌గా బాదడంతో రుతురాజ్‌ 60 బంతుల్లో సెంచరీ సాధించాడు.

తొలి బంతి నుంచే...
భారీస్కోరు చేశామన్న చెన్నై ధీమా సన్నగిల్లేందుకు ఎంతో సేపు పట్టలేదు. లూయిస్‌ (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి యశస్వీ జైస్వాల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యేకించి హాజల్‌వుడ్‌పై వీరంగమే చేశాడు. అతని రెండు ఓవర్లను (2, 5వ) జైస్వాలే ఆడి... ఆ 12 బంతుల్లో 2, 4, 0, 2, 4, 4, 0, 6, 6, 4, 6, 0 విధ్వంసంతో 38 పరుగులు పిండుకున్నాడు. అలా రాజస్తాన్‌ నాలుగో ఓవర్లలోనే 50 పరుగులు దాటేయగా... యశస్వీ 19 బంతుల్లోనే (6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ కొట్టాడు.

ఆరో ఓవర్లో లూయిస్‌ను శార్దుల్‌ పెవిలియన్‌ చేర్చా డు. పవర్‌ ప్లేలో రాయల్స్‌ 81/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌ తొలి బంతికి యశస్వీ విధ్వంసానికి ఆసిఫ్‌ చెక్‌ పెట్టాడు. అనంతరం కెప్టెన్‌ సామ్సన్‌ (28; 4 ఫోర్లు) , శివమ్‌ దూబే జట్టును విజయానికి చేరువ చేశారు. దూబే 31 బంతుల్లో (2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకం చేశాడు. మూడో వికెట్‌కు ఇద్దరు 89 పరుగులు జోడించారు. సామ్సన్‌ ఔటైనా... దూబే, గ్లెన్‌ ఫిలిప్స్‌ (14 నాటౌట్‌; ఫోర్, సిక్స్‌) జట్టును విజయతీరానికి చేర్చారు.

స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (నాటౌట్‌) 101; డుప్లెసిస్‌ (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) తెవాటియా 25; రైనా (సి) దూబే (బి) తెవాటియా 3; అలీ (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) తెవాటియా 21; రాయుడు (సి) ఫిలిప్స్‌ (బి) సకారియా 2; జడేజా (నాటౌట్‌) 32; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–47, 2–57, 3–114, 4–134. బౌలింగ్‌: ఆకాశ్‌ సింగ్‌ 4–0–39–0, సకారియా 4–0–31–1, ముస్తఫిజుర్‌ 4–0–51–0, తెవాటియా 4–0–39–3, మార్కండే 3–0–26–0, ఫిలిప్స్‌ 1–0–3–0.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: లూయిస్‌ (సి) హాజల్‌వుడ్‌ (బి) శార్దుల్‌ 27; జైస్వాల్‌ (సి) ధోని (బి) ఆసిఫ్‌ 50; సామ్సన్‌ (సి) గైక్వాడ్‌ (బి) శార్దుల్‌ 28; శివమ్‌ దూబే (నాటౌట్‌) 64; ఫిలిప్స్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం ( 17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–77, 2–81, 3–170. బౌలింగ్‌: స్యామ్‌ కరన్‌ 4–0–55–0, హాజల్‌వుడ్‌ 4–0–54–0, శార్దుల్‌ 4–0–30–2, ఆసిఫ్‌ 2.1–0–18–1, మొయిన్‌ అలీ 2.2–0–23–0, జడేజా 1–0–9–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement