అహ్మదాబాద్: ప్రత్యర్థి ఏదైనా... పరిస్థితి ఎలా ఉన్నా... ఆశ కోల్పోకుండా పట్టుదలతో పోరాడితే విజయం సాధ్యమేనని రాజస్తాన్ రాయల్స్ జట్టు నిరూపించింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా గత ఏడాది ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది.
కెప్టెన్ సంజూ సామ్సన్ (32 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెట్‌మైర్ (26 బంతుల్లో 56 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్తాన్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. చివరి ఓవర్లో రాజస్తాన్ నెగ్గేందుకు 7 పరుగులు అవసరంకాగా... తొలి బంతికి 2 పరుగులు తీసిన హెట్‌మైర్, రెండో బంతిని సిక్స్‌గా మలిచి రాజస్తాన్‌ను విజయతీరానికి చేర్చాడు. ఒకదశలో రాజస్తాన్ 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
అయితే సామ్సన్, హెట్‌మైర్ రాజస్తాన్‌ను ఆదుకున్నారు. ముఖ్యంగా సామ్సన్ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి సిక్సర్లతో చెలరేగిపోయాడు. రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సామ్సన్ వరుసగా మూడు సిక్స్‌లు కొట్టాడు. 15వ ఓవర్ చివరి బంతికి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సామ్సన్ అవుటయ్యాడు. దాంతో ఐదో వికెట్‌కు 27 బంతుల్లో 59 పరుగుల సామ్సన్, హెట్‌మైర్ భాగస్వామ్యానికి తెర పడింది. అప్పటికి రాజస్తాన్ గెలిచేందుకు 5 ఓవర్లలో 64 పరుగులు చేయాలి. సామ్సన్ అవుటయ్యాక వచ్చి న ధ్రువ్ జురేల్ (10 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడాడు.
రాజస్తాన్ గెలిచేందుకు 2 ఓవర్లలో 23 పరుగులు అవసరంకాగా... షమీ వేసిన 19వ ఓవర్ తొలి బంతిని ధ్రువ్ సిక్స్‌గా మలిచి తర్వాతి బంతికి అవుటయ్యాడు. వచ్చీరాగానే అశ్విన్ (3 బంతుల్లో 10) 4, 6 కొట్టి పెవిలియన్ చేరాడు. చివరి ఓవర్లో హెట్‌మైర్ మిగతా పనిని పూర్తి చేశాడు. అంతకుముందు గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు సాధించింది. గిల్ (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (30 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి అండ్ బి) బౌల్ట్ 4; గిల్ (సి) బట్లర్ (బి) సందీప్ శర్మ 45; సాయి సుదర్శన్ (రనౌట్) 20; హార్దిక్ పాండ్యా (సి) యశస్వి (బి) చహల్ 28; డేవిడ్ మిల్లర్ (సి) హెట్‌మైర్ (బి) సందీప్ శర్మ 46; అభినవ్ మనోహర్ (సి) పడిక్కల్ (బి) జంపా 27; తెవాటియా (నాటౌట్) 1; రషీద్ ఖాన్ (రనౌట్) 1; అల్జారి జోసెఫ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–5, 2–32, 3–91, 4–121, 5–166, 6–175, 7–176. బౌలింగ్: బౌల్ట్ 4–0–46–1, సందీప్ శర్మ 4–0–25–2, జంపా 4–0–32–1, అశ్విన్ 4–0–37–0, చహల్ 4–0–36–1.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) గిల్ (బి) హార్దిక్ 1; బట్లర్ (బి) షమీ 0; పడిక్కల్ (సి) మోహిత్ శర్మ (బి) రషీద్ ఖాన్ 26; సంజూ సామ్సన్ (సి) మిల్లర్ (బి) నూర్ అహ్మద్ 60; రియాన్ పరాగ్ (సి) మిల్లర్ (బి) రషీద్ ఖాన్ 5; హెట్‌మైర్ (నాటౌట్) 56; ధ్రువ్ జురేల్ (సి) మోహిత్ శర్మ (బి) షమీ 18; అశ్విన్ (సి) తెవాటియా (బి) షమీ 10; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.2 ఓవర్లలో 7 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–2, 2–4, 3–47, 4–55, 5–114, 6–161, 7–171. బౌలింగ్: షమీ 4–1–25–3, హార్దిక్ పాండ్యా 4–0–24–1, అల్జారి జోసెఫ్ 3–0–47–0, రషీద్ ఖాన్ 4–0–46–2, మోహిత్ శర్మ 2–0–7–0, నూర్ అహ్మద్ 2.2–0–29–1.
Comments
Please login to add a commentAdd a comment