ఇంగ్లండ్‌పై వరుస సెంచరీలతో విరుచుకుపడిన ఆర్సీబీ ప్లేయర్‌ | Rajat Patidar Hits Back To Back 100s For India A Against England Lions | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌పై వరుస సెంచరీలతో విరుచుకుపడిన ఆర్సీబీ ప్లేయర్‌

Published Fri, Jan 19 2024 11:38 AM | Last Updated on Fri, Jan 19 2024 11:46 AM

Rajat Patidar Hits Back To Back 100s For India A Against England Lions - Sakshi

ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌, మూడు అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో లయన్స్‌.. భారత్‌-ఏ జట్టుతో తలపడుతుంది. పర్యటనలో రెండు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ పూర్తి కాగా (డ్రా).. ప్రస్తుతం తొలి అనధికారిక టెస్ట్‌ జరుగుతుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఏ ఇంగ్లండ్‌ లయన్స్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 338 పరుగులు వెనుకపడి ఉంది. 

వరుస సెంచరీలతో విరుచుకుపడిన పాటిదార్‌..
ఇంగ్లండ్‌ లయన్స్‌తో సిరీస్‌లో భారత ఏ ఆటగాడు, ఐపీఎల్‌లో ఆర్సీబీ ప్లేయర్‌ రజత్‌ పాటిదార్‌ వరుస శతకాలతో విరుచుకుపడ్డాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో లయన్స్‌పై 141 బంతుల్లో 18 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 111 పరుగులు చేసిన పాటిదార్‌.. ప్రస్తుతం జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌లో 132 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన విధ్వంసకర శతకం (140) బాదాడు. 

ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన పాటిదార్‌.. సహచరులు అభిమన్యు ఈశ్వరన్‌ (4), సాయి సుదర్శన్‌(0), సర్ఫరాజ్‌ ఖాన్‌ (4), ప్రదోష్‌ పాల్‌ (0), శ్రీకర్‌ భరత్‌ (15), మానవ్‌ సుతార్‌ (0), పుల్కిత్‌ నారంగ్‌ (18) విఫలమైనా ఒక్కడే భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. తుషార్‌ దేశ్‌పాండే (23) సహకారంతో కష్టాల్లో (95/7) ఉన్న జట్టును ఆదుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి  భారత్‌ ఏ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. పాటిదార్‌కు జతగా నవదీప్‌ సైనీ (3) క్రీజ్‌లో ఉన్నాడు. 

అంతకుముందు ఇంగ్లండ్‌ లయన్స్ తొలి ఇన్నింగ్స్‌ను 553 పరుగుల వద్ద డిక్లేర్‌ (8 వికెట్ల నష్టానికి) చేసింది. జెన్నింగ్స్‌ (154), జోష్‌ బోహన్నన్‌ (125) శతకాలతో సత్తా చాటగా.. అలెక్స్‌ లీస్‌ (73), మౌస్లీ (68), జాక్‌ కార్సన్‌ (53) అర్ధసెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మానవ్‌ సుతార్‌ 4 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్‌ కావేరప్ప 2, సైనీ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.  

ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా జనవరి 25 నుంచి మొదలవుతుంది. తొలి రెండు టెస్ట్‌ల కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. అందులో పాటిదార్‌కు చోటు దక్కలేదు. తర్వాతి మూడు టెస్ట్‌ల కోసం ప్రకటించే జట్టులో పాటిదార్‌ చోటు ఆశిస్తున్నాడు. 

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్‌ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌కీపర్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌కీపర్‌), ధృవ్‌ జురెల్‌ (వికెట్‌కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, ఆవేశ్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement