శతక్కొట్టిన బెంగాల్‌ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు | Ranji Trophy 2023 24: Manoj Tiwari Bengal Team Beat Assam Innings 162 Runs | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన బెంగాల్‌ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు

Published Mon, Jan 29 2024 1:09 PM | Last Updated on Mon, Jan 29 2024 1:36 PM

Ranji Trophy 2023 24: Manoj Tiwari Bengal Team Beat Assam Innings 162 Runs - Sakshi

మనోజ్‌- సూరజ్‌ సెంచరీలు

రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా అసోం జట్టుపై బెంగాల్‌ ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుని.. ఏకంగా ఇన్నింగ్స్‌ 162 పరుగుల తేడాతో రియాన్‌ పరాగ్‌ సేనను మట్టికరిపించింది. గువాహటి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అసోం తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్‌ 405 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనుస్తుప్‌ మజుందార్‌(125), కెప్టెన్‌, బెంగాల్‌ క్రీడా శాఖా మంత్రి మనోజ్‌ తివారి(100) శతకాలకు తోడు.. లోయర్‌ ఆర్డర్‌లో కరణ్‌ లాల్‌(52), సూరజ్‌ సింధు జైస్వాల్‌(52) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. దీంతో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఈ మేరకు భారీ స్కోరు నమోదు చేసింది.

ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన అసోం.. బెంగాల్‌ బౌలర్ల దెబ్బకు 103 పరుగులకే చాపచుట్టేసింది. దినేశ్‌ దాస్‌(50), సాహిల్‌ జైన్‌(40) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 5 పరుగులు కూడా చేయలేకపోయారు.

ఇక కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ఆబ్సెంట్‌ హర్ట్‌(0)గా వెనుదిరిగాడు. బెంగాల్‌ బౌలర్లలో పేసర్‌ మహ్మద్‌ కైఫ్‌(మహ్మద్‌ షమీ తమ్ముడు) నాలుగు వికెట్లతో చెలరేగగా.. సూరజ్‌ సింధు జైస్వాల్‌ మూడు, అంకిత్‌ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి.

ఈ నేపథ్యంలో బెంగాల్‌ అసోంను ఫాలో ఆన్‌ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌట్‌ అయి భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈసారి సూరజ్‌ సింధు జైస్వాల్‌ 5 వికెట్లతో చెలరేగగా... అంకిత్‌, కరణ్‌ లాల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈసారీ రియాన్‌ ఆబ్సెంట్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

ఇక ఆదివారమే ముగిసిన ఈ మ్యాచ్‌లో బ్యాట్‌, బాల్‌తో అదరగొట్టిన సూరజ్‌ సింధు జైస్వాల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ తమ్ముడు మహ్మద్‌ కైఫ్‌.. తన అన్నలాగే సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు కాకుండా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది అరంగేట్రం చేసిన అతడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో తనదైన ముద్ర వేయడం విశేషం.

చదవండి: శివమ్‌ దూబే మెరుపు శతకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement