బ్లూ జెర్సీలో నితీశ్ రెడ్డి (PC: Nitish Kumar Reddy Insta)
Ranji Trophy 2023-24- Assam vs Andhra, Elite Group B- దిబ్రూగఢ్: అస్సాం జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును షోయబ్ మొహమ్మద్ ఖాన్ (63; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (49; 4 ఫోర్లు) ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించి ఆదుకున్నారు.
ఆంధ్ర జట్టు చివరి 4 వికెట్లను ఐదు పరుగుల తేడాలో కోల్పోయింది. అస్సాం బౌలర్లలో రాహుల్ సింగ్ (6/46), ముక్తార్ (2/45), ఆకాశ్ సేన్‌గుప్తా (2/37) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది.
మెరిసిన తనయ్, తన్మయ్, మిలింద్
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్‌లో హైదరాబాద్ క్రికెట్ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే నాగాలాండ్, మేఘాలయ జట్లపై ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేసిన హైదరాబాద్ వరుసగా మూడో విజయంపై కన్నేసింది.
సిక్కిం జట్టుతో శుక్రవారం మొదలైన మూడో మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 302 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సిక్కిం జట్టును హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ (6/25), సీవీ మిలింద్ (4/30) హడలెత్తించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్, మీడియం పేసర్ మిలింద్ దెబ్బకు సిక్కిం తొలి ఇన్నింగ్స్‌లో 27.4 ఓవర్లలో కేవలం 79 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 381 పరుగులు సాధించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (125 బంతుల్లో 137; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ చేయగా... రాహుల్ సింగ్ గహ్లోత్ (64 బంతుల్లో 83; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), రోహిత్ రాయుడు (111 బంతుల్లో 75; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు.
తన్మయ్, రాహుల్ తొలి వికెట్‌కు 18 ఓవర్లలో 132 పరుగులు జో డించడం విశేషం. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్‌కు 138 పరుగులు జత చేశారు. ప్రస్తుతం కెప్టెన్ తిలక్ వర్మ (66 బంతుల్లో 70 బ్యాటింగ్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), చందన్ సహని (8 బ్యాటింగ్; 1 సిక్స్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment