తిలక్ వర్మ- తనయ్ (PC: BCCI)
రంజీ ట్రోఫీ 2023-24 ప్లేట్ గ్రూప్ ఫైనల్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. మేఘాలయ టీమ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ విజేతగా నిలిచింది. హైదరాబాద్- మేఘాలయ మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫిబ్రవరి 17న మ్యాచ్ మొదలైంది.
టాస్ గెలిచిన మేఘాలయ తొలుత బ్యాటింగ్ చేసింది. 83 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. హైదరాబాద్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 5 వికెట్లతో చెలరేగగా.. రోహిత్ రాయుడు మూడు, రిషభ్ బస్లాస్, కెప్టెన్ తిలక్ వర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసింది. కె.నితేశ్‌రెడ్డి సెంచరీ(122)తో ఆకట్టుకోగా.. వికెట్ కీపర్ ప్రజ్ఞయ్‌రెడ్డి అజేయ శతకం(141 బంతుల్లో 102 పరుగులు) సాధించాడు. మరోవైపు.. కెప్టెన్ తిలక్ వర్మ 44 పరుగులతో రాణించాడు. ఫలితంగా మేఘాలయ కంటే తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది హైదరాబాద్.
ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మేఘాలయను లెఫ్టార్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ మరోసారి దెబ్బకొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్లు తీసి మేఘాలయ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. దీంతో 243 పరుగులకే మేఘాలయ కథ ముగిసింది.
ఈ క్రమంలో 198 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 5 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. ఓపెనర్ గహ్లోత్ రాహుల్ సింగ్(62), కెప్టెన్ తిలక్ వర్మ(64) అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇదిలా ఉంటే.. తాజా సీజన్‌లో ప్లేట్ గ్రూప్‌లో ఉన్న హైదరాబాద్, మేఘాలయ ఇప్పటికే ఎలైట్ డివిజన్‌కు అర్హత సాధించాయి. వచ్చే ఎడిషన్‌లో ఎలైట్ గ్రూపులో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే, మంగళవారం ముగిసిన ఫైనల్లో మేఘాలయపై పైచేయి సాధించి ఆధిపత్యాన్ని చాటుకుంది హైదరాబాద్. తద్వారా ప్లేట్ గ్రూపు చాంపియన్‌గా అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment