
తిలక్ వర్మ (ఫైల్ ఫొటో- PC: BCCI)
Ranji Trophy 2023-24- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ రంజీ ట్రోఫీ-2024లో జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు శతకాలు బాదిన అతడు.. తాజాగా మరో సెంచరీ చేశాడు. ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో భాగంగా నాగాలాండ్‌తో మ్యాచ్‌లో.. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ 101 పరుగులతో సత్తా చాటాడు.
శతక్కొట్టిన తన్మయ్
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం(164) బాదగా.. మరో ఓపెనర్ గహ్లోత్ రాహుల్ సింగ్(5) విఫలమయ్యాడు.
తిలక్ వర్మ మెరుపు సెంచరీ
వన్‌డౌన్ బ్యాటర్ రోహిత్ రాయుడు 59 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 135 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 రన్స్ చేశాడు.
మిగతావాళ్లలో తెలుకపల్లి రవితేజ 15 పరుగులకే పెవిలియన్ చేరగా.. కె.నితీశ్ రెడ్డి, వికెట్ కీపర్ ప్రజ్ఞయ్ రెడ్డి క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 90 ఓవర్లలో హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది.
శుక్రవారం నాటి ఆట పూర్తయ్యే సరికి నితీశ్ రెడ్డి 21, ప్రజ్ఞయ్ రెడ్డి 12 పరుగులతో ఆడుతున్నారు. ఇక నాగాలాండ్ బౌలర్లలో కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ రెండు, తహ్మీద్ రహ్మాన్, ఖ్రివిస్టో కెన్స్, ఇమ్లీవతి లెమ్య్టూర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలైట్ గ్రూపులో అడుగుపెట్టాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది.
చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం