Ranji Trophy 2023-24 Hyd Vs NGL: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ దుమ్ములేపాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 112 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కును అందుకున్నాడు.
కాగా దేశవాళీ టెస్టు ఫార్మాట్ టోర్నీ రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ శుక్రవారం ఆరంభమైంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టుతో తలపడుతోంది. దిమాపూర్ వేదికగా మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య నాగాలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలో షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ రాయుడు 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే, అతడి స్థానంలో వన్‌డౌన్‌లో దిగిన గహ్లోత్ రాహుల్ సింగ్, మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(80)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
టీ20 తరహా బ్యాటింగ్ చేస్తూ 157 బంతుల్లో 136కు పైగా స్ట్రైక్‌రేటుతో ఏకంగా 214 పరుగులు సాధించాడు. రాహుల్ సింగ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం.
ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ.. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా తెలుకపల్లి రవితేజ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
కాగా శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి హైదరాబాద్ 76.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసింది. నాగాలాండ్ బౌలర్లలో కరుణ్ తెవాటియా, నగాహో చిషి, ఇమ్లివటి లెమ్టూర్, క్రెవిస్టో కెన్సె, కెప్టెన్ రొంగ్సెన్ జొనాథన్ ఒక్కో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment