తన్మయ్ అగర్వాల్ (PC: X)
సాక్షి, హైదరాబాద్- Ranji Trophy 2023-24- Hyderabad vs Arunachal Pradesh: దేశవాళీ క్రికెట్‌లో అనామక అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (160 బంతుల్లో 323 బ్యాటింగ్, 33 ఫోర్లు, 21 సిక్స్‌లు), కెప్టెన్ రాహుల్ సింగ్ గహ్లోత్ (105 బంతుల్లో 185; 26 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్‌లో భాగంగా సొంతగడ్డపై జరుతున్న నాలుగు రోజుల లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలిరోజు ‘సూపర్‌ఫాస్ట్’ ప్రదర్శన కనబరిచింది.
ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 529 పరుగులు సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్ 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముందుగా అరుణాచల్ ఇన్నింగ్స్‌ను కూల్చడం మొదలు, హైదరాబాద్ బ్యాటింగ్ అంతా మెరుపు వేగంతో సాగిపోయింది.
హైదరాబాద్ బౌలర్ల విజృంభణతో
తూంకుంటలోని నెక్స్‌జెన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ తెచీ డోరియా (127 బంతుల్లో 97 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. హైదరాబాద్ బౌలర్లు సీవీ మిలింద్ (3/36), కార్తికేయ (3/28), తనయ్ త్యాగరాజన్ (2/53) అరుణాచల్ జట్టును కట్టడి చేశారు.
తొలి వికెట్‌కు 449 పరుగుల భాగస్వామ్యం
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్, రాహుల్ అరుణాచల్ బౌలర్లపై విధ్వంసరచన చేశారు. ఇద్దరూ చెలరేగిన తీరుతో ప్రతీ ఓవర్ హైలైట్స్‌ను తలపించింది.
తొలుత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
తన్మయ్‌తో రాహుల్ తొలి వికెట్‌కు 40.2 ఓవర్లలో 449 పరుగుల భాగస్వామ్యం జోడించాక అవుటయ్యాడు. రాహుల్ అవుటయ్యాక కూడా తన్మయ్ తన జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా తన్మయ్ నిలిచాడు.
తన్మయ్ 119 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా... 1985లో బరోడా జట్టుపై రవిశాస్త్రి (ముంబై) 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. డబుల్ సెంచరీ పూర్తయ్యాక కూడా తన్మయ్ విధ్వంసం కొనసాగింది.
ఫాస్టెస్ట్ ‘ట్రిపుల్ .. ఇషాన్ సిక్సర్ల రికార్డు బద్దలు
ఈ క్రమంలో తన్మయ్ ఫస్ట్‌క్లాస్ ఫాస్టెస్ట్ ట్రిపుసెంచరీ’ సాధించిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. తన్మయ్ 147 బంతుల్లో ‘ట్రిపుల్ సెంచరీ’ సాధించి ... 2017లో దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో 191 బంతుల్లో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసిన మార్కో మరైస్ రికార్డును బద్దలు కొట్టాడు.
అంతేకాకుండా రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. శుక్రవారం నాటి మొదటిరోజు ఆట ముగిసేసరికి తన్మయ్ 21 సిక్స్‌లు కొట్టగా... జార్ఖండ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ (2016లో ఢిల్లీపై 14 సిక్స్‌లు), హిమాచల్‌ప్రదేశ్ ఆటగాడు శక్తి సింగ్ (1990లో హరియాణాపై 14 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది.
Day 2- 366 పరుగులు చేసి అవుట్
తన్మయ్ అగర్వాల్ వీరవిహారానికి అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ నబం టెంపోల్ బ్రేక్ వేశాడు. శనివారం నాటి రెండో రోజు ఆటలో 366 పరుగుల వ్యక్తిగత స్కోరు(34 ఫోర్లు, 26 సిక్సర్లు) వద్ద తన్మయ్ క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు.
దీంతో రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్.. అభిరథ్ రెడ్డి(37), నితేశ్ రెడ్డి(12) రూపంలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 59 ఓవర్లు ముగిసే సరికి 614-4 స్కోరు చేసిన హైదరాబాద్ ప్రస్తుతం 442 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment