అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఒక్కో మ్యాచ్‌కు ఒకటి లేదా రెండు రోజుల విరామం తీసుకోవడం సర్వ సాధారణం. భారతీయ అగ్రశ్రేణి క్రికెటర్లయితే కొన్ని సందర్భాల్లో అంతకుమించి విరామం తీసుకుంటుంటారు. సిరీస్, సిరీస్‌కు మధ్య గ్యాప్ గురించైతే చెప్పక్కర్లేదు. కొందరు భారత ఆటగాళ్లు ఏకంగా నెలల తరబడి గ్యాప్ తీసుకోవడం చూశాం. భారత ఆటగాళ్లకు పెద్దగా అంతర్జాతీయ కమిట్‌మెంట్స్ (ఐపీఎల్ మినహా ఇతర లీగ్‌ల్లో ఆడే అవకాశం లేదు) లేకపోవడంతో అవకాశం దొరికినప్పుడల్లా విరామం తీసుకుంటుంటారు.
అయితే, ఈ పరస్థితికి ఆఫ్ఘనిస్థాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ మాత్రం మినహాయింపు. ఈ టాప్ స్పిన్నర్ గంటల వ్యవధిలో ప్రపంచం మొత్తం చుట్టేస్తుంటాడు. నిన్న భూమికి ఓ పక్కన ఉంటే, ఇవాళ మరో పక్కలో ప్రత్యక్షమవుతాడు. విశ్వవ్యాప్తంగా జరిగే దాదాపు అన్ని లీగ్‌ల్లో పాల్గొనే రషీద్ ఖాన్, కనీస విరామం అనేది లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. వయసు, ఫామ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలని అనుకున్నాడేమో కానీ, రషీద్.. ఎక్కడ ఏ లీగ్ జరిగినా రెక్కలు కట్టుకుని వాలిపోతున్నాడు.
తాజాగా ఈ నెల 16న బంగ్లాదేశ్‌లో ఆ జట్టుతో రెండో టీ20 ఆడిన రషీద్.. ఇవాళ (జులై 18) అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు తరఫున ఆడాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రషీద్ ఓ వికెట్ పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్‌లో 9 బంతులను ఎదుర్కొని 2 బౌండరీల సాయంతో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో రషీద్ టీమ్ ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. డెవాన్ కాన్వే సూపర్ ఫిఫ్టితో సూపర్ కింగ్స్‌ను గెలిపించాడు.
ప్రపంచవ్యాప్తంగా రషీద్ ప్రాతినిథ్యం వహిస్తున్న లీగ్‌లు, జట్ల వివరాలు..
- ఆఫ్ఘనిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్, మిగతా ఫార్మాట్ల జట్లలో సభ్యుడు
- ఐపీఎల్- గుజరాత్ టైటాన్స్
- బిగ్‌బాష్ లీగ్- అడిలైడ్ స్ట్రయికర్స్
- పాకిస్తాన్ సూపర్ లీగ్- లాహోర్ ఖలందర్స్
- ఆఫ్ఘనిస్తాన్ సూపర్ లీగ్- బంద్ ఏ అమీర్ డ్రాగన్స్
- మేజర్ లీగ్ క్రికెట్- ముంబై ఇండియన్స్ న్యూయార్క్
- కరీబియన్ ప్రీమియర్ లీగ్- బార్బడోస్ ట్రైడెంట్స్
- టీ20 బ్లాస్ట్- ససెక్స్
ఇవే కాక రషీద్ గతంలో లంక ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ తదితర లీగ్‌ల్లో ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment