దూసుకుపోతున్న రవీంద్ర జడేజా | Ravindra Jadeja Became The Best All Rounder So Far In WTC | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న రవీంద్ర జడేజా

Published Mon, Feb 19 2024 3:26 PM | Last Updated on Mon, Feb 19 2024 4:46 PM

Ravindra Jadeja Became The Best All Rounder So Far In WTC - Sakshi

టీమిండియా ఆటగాడు  రవీంద్ర జడేజాఇటీవలికాలంలో పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా టెస్ట్‌ ఫార్మాట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. బౌలర్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్ట్‌లో ఆల్‌రౌండ్‌ షోతో ఇరగదీసిన జడ్డూ భాయ్‌.. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతమైన సెంచరీతో కదంతొక్కిన జడ్డూ.. అనంతరం బంతితో విజృంభించాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన జడేజా.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో విశ్వరూపం ప్రదర్శించి ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా ధాటికి ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూలి 434 పరుగులు భారీ తేడాతో ఓటమిపాలైంది.

ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో రెండో టెస్ట్‌ మిస్‌ అయిన జడేజా తొలి మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లోనూ అతను ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. బౌలింగ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టిన జడేజా.. బ్యాటింగ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 87, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 2 పరుగులు చేశాడు.

టెస్ట్‌ల్లో పర్ఫెక్ట్‌ ఆల్‌రౌండర్‌గా రాటుదేలిన జడేజా.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందుకు అతని గణాంకాలే సాక్ష్యం. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడిన జడేజా బ్యాటింగ్‌లో 49.95 సగటున 1520 పరుగులు చేసి బౌలింగ్‌లో 25.08 సగటున 95 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ఈ టోర్నీలో జడ్డూ మూడు సెంచరీలు, 10 అర్దసెంచరీలు బాదాడు.

ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌ (2023-25) విషయానికొస్తే.. జడేజా ఇప్పటివరకు (ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌) 5 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, రెండు అర్దసెంచరీల సాయంతో 299 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 19 వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్‌ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.  రాంచీ వేదికగా నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement