టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రెవిస్ హెడ్ వికెట్ తీయడం ద్వారా జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. బ్యాటుతో 5 వేల పరుగులు, బంతితో 500 వికెట్లు తీసిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు రవీంద్ర జడేజా.
ఇంతకముందు టీమిండియా నుంచి కపిల్ దేవ్ ఒక్కడే ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన 11వ ప్లేయర్ జడేజా. ఇంతకుముందు కపిల్ దేవ్‌తో పాటు ఇమ్రాన్ ఖాన్, ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్, షాన్ పోలాక్, చమిందా వాస్, డానియల్ విటోరి, జాక్వస్ కలీస్, షాహిద్ ఆఫ్రిదీ, షకీబ్ అల్ హసన్ ఈ ఫీట్ సాధించారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ స్పిన్నర్లు కుహ్నెమన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ ధాటికి టీమిండియా బ్యాటర్లు నిలవలేకపోయారు. పిచ్‌పై బంతి అనూహ్యంగా టర్న్ అవుతుండడంతో ఎలా ఆడాలో తెలియక బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు.
కోహ్లి 22 పరుగులు చేయగా.. గిల్ 21 పరుగులు చేశాడు. కుహ్నెమన్ ఐదు వికెట్లు తీయగా.. లియోన్ 3, మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.
చదవండి: Ind Vs Aus 3rd Test: ప్రపంచంలో ఎక్కడా ఇలా జరుగదు! అవునంటూ ఆసీస్ దిగ్గజానికి రవిశాస్త్రి కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment