టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో మరోసారి తన ముద్ర చూపించాడు. దాదాపు ఐదు నెలలు ఆటకు దూరమైనప్పటికి రీఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అలరించి ఆల్‌రౌండర్ అనే పదానికి మరోసారి సరైన నిర్వచనం చెప్పాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీసిన జడ్డూ.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రాణించాడు.
ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా 70 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 88 పరుగులు జోడించి టీమిండియాను పటిష్టమైన స్థానంలో నిలిపాడు. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు గానూ జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విజయం అనంతరం జడేజా మాట్లాడాడు.
''అద్భుతమమైన అనుభూతి కలుగుతుంది. దాదాపు ఐదు నెలల తర్వాత క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చి వంద శాతం ప్రదర్శన(బ్యాట్‌తో పరుగులు, బంతితో వికెట్లు) ఇస్తే ఎవరికైనా సంతోషమే కలుగుతుంది. రీఎంట్రీలో నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా. రీఎంట్రీకి ముందు ఎన్‌సీఏలో చాలా కష్టపడ్డా.. అందుకు సహకరించిన ఎన్‌సీఏ స్టాఫ్‌తో పాటు ఫిజియోలకు ప్రత్యేక కృతజ్థతలు. ఒక్కోసారి ఆదివారాలు కూడా నాకోసం పనిచేసేవారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంతి వికెట్ల మీదకు వస్తుండడంతో మా పని సులవుగా మారింది. ఆసీస్ ఆటగాళ్లు తప్పు చేశారంటే మాకు చాన్స్ వచ్చినట్లే. దానిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాం. ఇక బ్యాటింగ్‌లోనూ రాణించడం మంచి పరిణామం. ఏ స్థానంలో బ్యాటింగ్ వస్తున్నామన్నది ముఖ్యం కాదు.. 5,6,7.. ఇలా ఏ స్థానమైన నాకు పర్లేదు.. ఎందుకంటే చివరికి నా బ్యాట్ నుంచి వచ్చేది పరుగులే కాబట్టి.'' అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment