ఆర్సీబీకి షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ఆటగాడు! | RCB Opener-Jacob Bethell-Officially Ruled Out-IPL 2026 Files England | Sakshi
Sakshi News home page

ఆర్సీబీకి షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ఆటగాడు!

May 23 2026 9:31 PM | Updated on May 23 2026 10:43 PM

RCB Opener-Jacob Bethell-Officially Ruled Out-IPL 2026 Files England

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్ హోదాకు తగ్గట్లే టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అయితే గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్ పోరుకు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో ఓపెనర్‌గా రాణిస్తున్న జాకబ్ బెతెల్ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. 

చేతి వేలి గాయంతో జాకబ్ బెతెల్‌ జట్టును వీడినట్లు ఆర్సీబీ యాజమాన్యం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే జూన్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడ‌నుంది. దీంతో స్వ‌దేశంలో చేతి వేలి గాయానికి సంబంధించి మెరుగైన చికిత్స తీసుకోవడానికి ఇంగ్లండ్‌ వెళ్లిన‌ట్లు ఆర్సీబీ తెలిపింది.  

'పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో జాక‌బ్ బెథెల్ ఎడ‌మ చేతి వేలికి గాయ‌మైంది. అయితే జూన్‌లో ఇంగ్లండ్‌కు కీల‌క‌మైన టెస్టు సిరీస్ ఉండ‌డంతో మెరుగైన వైద్య ప‌రీక్ష‌ల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు' అని ఆర్సీబీ త‌మ ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా ఇంగ్లండ్‌కే చెందిన మ‌రో స్టార్ ఆట‌గాడు ఫిల్ సాల్ట్ గాయ‌ప‌డ‌డంతో జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న జాక‌బ్ బెతెల్ సీజ‌న్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడాడు. 

ఫిల్ సాల్ట్ తిరిగొచ్చిన‌ప్ప‌టికీ బెతెల్ రాణించ‌డంతో జ‌ట్టులో అత‌డినే కంటిన్యూ చేసింది. అయితే మే 26న ధ‌ర్మ‌శాల‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌ర‌గ‌నున్న క్వాలిఫ‌య‌ర్‌-1 పోరుకు జాక‌బ్ బెతెల్ దూరం కావడంతో కోహ్లీతో క‌లిసి ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ఆరంభించే అవ‌కాశ‌ముంది. అందుకే జాక‌బ్ బెతెల్ స్థానాన్ని ఎవ‌రితో భ‌ర్తీ చేయ‌డం లేద‌ని ఆర్సీబీ మ‌రో ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

ఇక ఇంగ్లండ్ స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది. జూన్ 4 నుంచి 8 మ‌ధ్య తొలి టెస్టు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా జాక‌బ్ బెతెల్ గాయంపై స్పందించింది. ‘న్యూజిలాండ్‌తో వ‌చ్చే నెల‌లో టెస్టు సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్ కోసం జాక‌బ్ బెతెల్‌ను ఎంపిక చేశాం. తొలి టెస్టుకు ముందే జాక‌బ్ బెతెల్ గాయం తీవ్ర‌త‌ను పూర్తిగా అంచ‌నా వేసేందుకు వైద్య బృందం ప‌ర్య‌వేక్షించ‌నుంది’ అని పేర్కొంది.

చదవండి: టెస్టు క్రికెట్‌లో ఐసీసీ కీల‌క మార్పులు!

Advertisement
 
Advertisement
Advertisement