This Run Out: MS Dhoni Wins ICC Spirit of Cricket Award of th Decade, Cricket News in Telugu - Sakshi
Sakshi News home page

ధోనికి ‘స్పిరిట్‌ ఆఫ్‌ ద డెకేడ్‌’.. కారణం ఇదే!

Published Mon, Dec 28 2020 4:04 PM | Last Updated on Mon, Dec 28 2020 6:29 PM

Reason Behind Dhoni Wins ICC Spirit of Cricket Award Of The Decade - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తాజాగా ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల అవార్డుల్లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఇటీవల ఐసీసీ నామినేట్‌ చేసిన ఐదు అవార్డులకు కోహ్లి నామినేట్‌ కాగా అందులో రెండు అవార్డులు అతన్ని వరించాయి. అందులో సర్‌ గార్ల్‌ఫీల్డ్‌ సోబర్స్‌ అవార్డు ఫర్‌ ఐసీసీ మేల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద డెకేడ్‌ అవార్డు ఒకటి కాగా, దశాబ్దపు  మెన్స్‌ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద డెకేడ్‌ అవార్డును కూడా కోహ్లి గెలుచుకున్నాడు. ఇక దశాబ్దపు స్పిరిట్‌ ఆఫ్‌ ద క్రికెటర్‌ అవార్డు టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి దక్కగా, ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌కు దశాబ్దపు అత్యుత్తమ టెస్టు ప్లేయర్‌ అవార్డు లభించింది. ఇక్కడ కోహ్లి, స్మిత్‌లు అవార్డులు ఒకటైతే, ధోనికి దక్కిన అవార్డు మరొక ఎత్తు. అసలు ధోనికి దశాబ్దపు స్పిరిట్‌ ఆఫ్‌ ద క్రికెట్‌ అవార్డు లభించడం ఎక్కువ వార్తల్లో నిలిచింది. ధోనికి ఈ అవార్డు ఎందుకు దక్కింది అనే విషయాన్ని పరిశీలిస్తే, ఇక్కడ మనం 9 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. (బాక్సింగ్‌ డే టెస్టు: అంపైర్స్‌ కాల్‌పై సచిన్‌ అసహనం)

ఎంఎస్‌ ధోని అత్యంత విజయవంతమైన సారథి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. మైదానంలో ధోనికి శరీరమంతా కళ్లు ఉంటాయని, ముఖ్యంగా ఫీల్డింగ్, బౌలర్లతో వ్యూహాలు రచించి బ్యాట్స్‌మన్ బోల్తా కొట్టించే విషయంలో అతనికి సాటిలేరని ఈ జార్ఖండ్ డైనమైట్ కెప్టెన్సీని కొనియాడుతుంటారు. కానీ భారత్ 2011 ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్ట్ మాత్రం అతని కెప్టెన్సీ కెరీర్‌కే ప్రత్యేకం. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. క్రీడా స్పూర్తి విషయంలో యావత్ క్రికెట్ ప్రపంచం ముందు విజేతగా నిలబడి ప్రశంసలు అందుకుంది. 

ఇయాన్‌ బెల్‌ రనౌట్‌ వివాదాస్పదం..
యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ మ్యాచ్ బ్యాట్స్‌మన్ అలసత్వానికి ఓ గుణపాఠంగా నిలిచింది. ముఖ్యంగా ఇయాన్ బెల్ వివాదస్పద రనౌట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ట్రెంట్ బ్రెడ్జ్ వేదికగా జరిగిన నాటి రెండో టెస్ట్ మూడో రోజు ఆట ఓ డ్రామాను తలిపించింది. టీ బ్రేక్ సమయం ముందు ఇషాంత్ శర్మ వేసిన 66వ ఓవర్ చివరి బంతిని నాటి ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా చక్కటి షాట్ ఆడాడు. దాదాపు బౌండరీ అనుకుంటుండగా.. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న ప్రవీణ్ కుమార్ అద్భుత డైవ్‌తో బంతిని అడ్డుకున్నాడు. అయితే అది ఫోరా? కాదా? అనే సందిగ్ధత నెలకొంది. ఈ లోపు ఇయాన్ బెల్, మోర్గాన్ మూడు పరుగులు పూర్తి చేశారు. అయితే అది టీ బ్రేక్ ముందు బంతి కావడం.. బౌండరీ పోయిందనే అలసత్వంతో ఇయాన్ బెల్ మూడో పరుగు తర్వాత నాలుగో రన్ కోసం సగం క్రీజు వరకు పరుగెత్తుకొచ్చి ఆగిపోయాడు.

ధోని సమయస్ఫూర్తి
ఇక బంతిని అందుకున్న ధోని తెలివిగా స్టంప్స్‌ వద్ద ఉన్న సాహాకు బంతి విసిరడంతో అతను వికెట్లను గిరటేశాడు. దీంతో ఒక్కసారిగా మైదానంలో అయోమయం చోటుచేసుకుంది. అంపైర్లకు కఠిన సవాల్ ఎదురైంది. ముందుగా ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సాయంతో బంతి బౌండరీనా? కాదా? అని పరీక్షించారు. బంతి బౌండరీ వెళ్లలేదని తేలడంతో.. భారత ఫీల్డర్లు అప్పీల్ చేశారా? లేదా ? అని పరీక్షించారు. వారు అప్పీల్ చేయడంతో మరోసారి ధోనీని ప్రశ్నించారు. అతను అప్పీల్ వెనక్కు తీసుకోవడానికి నిరాకరించడంతో నిబంధనల మేరకు ఇయాన్ బెల్‌ను రనౌట్‌గా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంతో అవాక్కైన ఇయాన్.. ఓవర్ పూర్తయిందనే మాట విన్నానని, బెయిల్స్ కిందపడేయంతోనే ఆగిపోయానని అంపైర్లకు తెలుపుతూ అసంతృప్తితో మైదానం వీడాడు. (రెండు ఫార్మాట్లకు ధోనినే కెప్టెన్‌!)

మిస్టర్‌ కూల్‌ క్రీడాస్ఫూర్తి
ఇక టీ బ్రేక్ సమయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాటి ఇంగ్లండ్ కోచ్ అండీ ఫ్లవర్, కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ లు ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళి ఇయాన్ ఔట్ అప్పీల్‌ను ఉపసంహరించుకోవలసిందిగా ధోనిని కోరడంతో ఇయాన్ బెల్ క్రీజులోకి అడుగుపెట్టాడు. దీంతో ఇంగ్లండ్ అభిమానులు ధోనీని కొనియాడారు. క్రీడా స్పూర్తి చాటాడని హీరో అంటూ ప్రశంసించారు. బ్రిటీష్ మీడియా సైతం ధోనీ, భారత జట్టు నిర్ణయాన్ని ప్రశంసించింది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఇయాన్ బెల్ అలసత్వమేనని, అతను నిబంధనల మేరకే ఔటయ్యాడని, ధోని క్రీడాస్పూర్తి చాటడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయంతో అప్పట్లోనే ధోని ఐసీసీ స్పిరిట్ క్రికెట్ ఆఫ్ ద అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఆ రనౌట్‌ను వెనక్కి తీసుకోవడంతోనే ఇప్పుడు ధోనికి స్పిరిట్‌ ఆఫ్‌ ద క్రికెట్‌ అవార్డు ఆఫ్‌ డెకేడ్‌ దక్కడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement