
టీమిండియా విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్ మళ్లీ రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా-బి జట్టు తరపున రింకూ ఆడనున్నాడు. భారత-బి జట్టులోని చాలా మంది ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లనున్నారు.
ప్రస్తుతం బి జట్టులో భాగంగా ఉన్న యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ దయాల్‌లకు బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 12 నుంచి జరగనున్న తదుపరి రౌండ్ మ్యాచ్‌లకు వీరిందరూ అందుబాటులో ఉండరు.
ఈ నేపథ్యంలోనే రింకూ సింగ్‌తో పాటు మరో ఉత్తరప్రదేశ్ ఆటగాడు ఆకిబ్ ఖాన్‌కు దులీప్ ట్రోఫీలో ఆడేందుకు పిలుపు వచ్చింది అయితే ఈ దేశీవాళీ టోర్నీకి ముందు ఎంపిక చేసిన జట్లలో రింకూకు చోటు దక్కలేదు. దీంతో అతడు యూపీ టీ20లో లీగ్‌లో భాగమయ్యాడు. కానీ ఇప్పుడు సెలక్టర్లు నుంచి పిలుపు రావడంతో అతడు ఇండియా బి జట్టుతో చేరనున్నాడు.
"దులీప్ ట్రోఫీలో ఆడేందుకు అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కష్టపడి పనిచేయడమే నా పని. మొదట జట్లను ప్రకటించినప్పుడు.. నా పేరు లేకపోవడం కాస్త నిరుత్సాహపడ్డాను. కానీ ఇప్పడు మళ్లీ పిలుపు రావడంతో సంతోషంగా ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ పేర్కొన్నాడు. అతడు త్వరలోనే అనంతపూర్‌లో ఉన్న భారత జట్టుతో చేరనున్నాడు.
చదవండి: IND vs BAN: అప్పుడు జీరో.. కట్ చేస్తే..! ఇప్పుడు ఏకంగా టీమిండియాలో ఎంట్రీ?