టీ20 క్రికెట్‌లో టీమిండియా దూకుడు మంత్రంతో దూసుకెళ్తోందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇందుకు కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్, నూతన సారథి సూర్యకుమార్ యాదవ్‌లే కారణమని పేర్కొన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా పరుగుల విధ్వంసం సృష్టించేందుకు యంగిస్తాన్ సిద్ధమైందని.. మున్ముందు పొట్టి ఫార్మాట్లో భారత జట్టు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.
లంక పర్యటనతో మొదలు
కాగా టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసిన గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన ప్రయాణం ప్రారంభించాడు. సూర్యకుమార్ పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత జరిగిన పొట్టి సిరీస్‌లో లంకను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం వీరిద్దరి కాంబినేషన్‌లో స్వదేశంలో టీమిండియా ఇటీవలే బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడింది.
బంగ్లా బౌలింగ్ ఊచకోత
సొంతగడ్డపై యువ ఆటగాళ్లతో నిండిపోయిన సూర్యసేన ఆకాశమే హద్దుగా చెలరేగి.. బంగ్లానూ 3-0తో వైట్‌వాష్ చేసింది. అయితే, లంక పర్యటనతో పోలిస్తే ఈసారి మరింత వేగంగా, మరింత దూకుడుగా పరుగులు రాబట్టింది. తొలి టీ20లో 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. ఆఖరి రెండు మ్యాచ్‌లలో బంగ్లా బౌలింగ్‌ను ఊచకోత కోసింది. వరుసగా 221, 297 పరుగులు సాధించి వారెవ్వా అనిపించింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ జోడీ టీమిండియాకు సరికొత్త దూకుడు మంత్రాన్ని ఉపదేశించింది. మ్యాచ్ అయినపోయిన తర్వాత రింకూ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.
పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారు
విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం తప్ప.. వేరే విషయాల గురించి ఆలోచించవద్దని తమకు ఆదేశాలు వచ్చాయన్నాడు. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాలని.. వికెట్ పడుతుందనే బెంగ వద్దని మేనేజ్‌మెంట్ చెప్పిందన్నాడు. దీనిని బట్టి కోచ్, కెప్టెన్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్ పారేసుకుంటే జట్టులో చోటు దక్కదని ఆటగాళ్లు భయపడతారు. అయితే, స్వయంగా మేనేజ్‌మెంట్ రంగంలోకి దిగి ఫాస్ట్‌గా ఆడమని చెప్పటమే గాక.. ఆ క్రమంలో ప్రతికూల ఫలితాలు వచ్చినా అండగా ఉంటే.. అంతకంటే ఆటగాళ్లకు ఇంకేం కావాలి.
బలహీన జట్లపై మాత్రమేనా?
జట్టులో తమ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్లేయర్లు భావిస్తే.. ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి మరి! ఈ యంగిస్తాన్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పటి వరకు యువ టీమిండియా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలహీన జట్లపై తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపిందన్న ఆకాశ్ చోప్రా.. పటిష్ట జట్లపై కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే కొన్నిసార్లు చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు.
ఏదేమైనా తమ బ్యాటింగ్.. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎలా ఉంటుందో ఇప్పటికే చూపించిందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు 180కి పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశారు.
చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే!
Comments
Please login to add a commentAdd a comment