దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023 ఇవాల్టి (జులై 24) నుంచి ప్రారంభమైంది. టోర్నీలో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో ఈస్ట్ జోన్-సెంట్రల్ జోన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్
తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ నిర్ణీత 50 ఓవర్లు ఆడి 207 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (8) సహా టాపార్డర్ అంతా విఫలం కాగా.. శివమ్ చౌదరీ (22), కర్ణ శర్మ (32) సహకారంతో రింకూ సింగ్ (63 బంతుల్లో 54; ఫోర్, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు.
కష్ట సమయంలో బరిలోకి దిగిన రింకూ సింగ్.. శివమ్ చౌదరీ, కర్ణ శర్మలతో చెరో 50 ప్లస్ భాగస్వామ్యాలు నెలకొల్పి స్కోర్ 200 దాటేలా చేశాడు. అనంతరం ఆరో వికెట్‌గా రింకూ వెనుదిరగడంతో సెంట్రల్ జోన్ పతనం ఆరంభమైంది. ఆ జట్టు మరో 31 పరుగులు జోడించి ఆఖరి 4 వికెట్లు కోల్పోయింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో మురసింగ్, ఆకాశ్ దీప్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు పడగొట్టగా... ఉత్కర్ష్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
రాణించిన ఉత్కర్ష్ సింగ్.. ఈస్ట్ జోన్ సునాయాస విజయం
అనంతరం 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఈస్ట్ జోన్.. అభిమన్యు ఈశ్వరన్ (38), ఉత్కర్ష్ సింగ్ (89), సుభ్రాన్షు్ సేనాపతి (33 నాటౌట్) రాణించడంతో 46.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా గెలుపొందింది. సెంట్రల్ జోన్ బౌలర్లలో కర్ణ్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. అదిత్య సర్వటే ఓ వికెట్ దక్కించుకున్నాడు.
కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో సత్తా చాటిన (కేకేఆర్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 59.25 సగటున 149.52 స్ట్రయిక్‌రేట్‌తో 474 పరుగులు) రింకూ సింగ్.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. గత ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. అదే ఫామ్‌ను రింకూ ప్రస్తుతం దేశవాలీ టోర్నీల్లోనూ కొనసాగిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment