Photo Credit: BCCI Twitter
దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్న జాబితాలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు సంపాదించాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి ఉత్తరాఖండ్‌లో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా పంత్ రికార్డులకెక్కాడు. ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరాఖండ్ ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వ్యక్తుల జాబితాను విడుదల చేయగా.. అందులో పంత్ అత్యధిక పన్ను చెల్లించి అగ్రస్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. రూర్కీలో జన్మించిన పంత్ బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్‌లో ప్రస్తుతం లక్నో క్యాపిటల్స్ నుంచి అందుకున్న మొత్తం, మ్యాచ్ ఫీజులు, ఇతర వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు ఇతరత్రా ఆదాయ మార్గాల ద్వారా సంపాదిస్తున్నాడు.
అయితే గతేడాదితో పోలిస్తే పంత్ ఈసారి చెల్లించిన పన్ను మొత్తం రెండింతలకు పైనే ఉండడం గమనార్హం. గతేడాది పంత్ సుమారు రూ. 10.5 కోట్ల పన్ను చెల్లించాడు. ఈసారి మాత్రం అతడి పన్ను చెల్లింపు మొత్తం గణీనీయంగా పెరిగింది. రికార్డు స్థాయిలో రూ. 23.84 కోట్లు చెల్లించి రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా పంత్ నిలిచాడు. మరోవైపు జార్ఖండ్-బీహార్ రాష్ట్రాల్లో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వారిలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం రిషబ్ పంత్ శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. లంక గడ్డపై రాణించాలనే పట్టుదలతో ఉన్న పంత్ ఇటీవలే తన గురువు ఎంఎస్ ధోని వద్ద ప్రత్యేక సలహాలు, సూచనలు అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో తరఫున పంత్ 14 మ్యాచ్‌లో 312 పరుగులు సాధించాడు. లక్నోను క్వాలిఫయర్ చేర్చడంలో పంత్ విఫలమయ్యాడు.
ఇక ఇటీవల స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆడిన పంత్ 81 పరుగులతో రాణించాడు. ఇక పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి రెండేళ్లు కావొస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది.
PANT BECOMES THE HIGHEST TAXPAYER FROM UTTARAKHAND. 💰
- Rishabh Pant emerged as the highest individual taxpayer in Uttarakhand after paying ₹23.84cr income tax for 2025-26 financial year. (ABP). pic.twitter.com/33xkT1Ev6r— Mufaddal Vohra (@mufaddal_vohra) August 5, 2026


