ప్రతిష్టాత్మ యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి రెండింటిలో ఆసీస్ విజయం సాధించగా.. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి రేసులో నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 19 నుంచి 23 వరకు జరగనుంది.
ఈ విషయం పక్కనబెడితే లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంతి డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజు దాటడంతో ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ వికెట్లకు గిరాటేశాడు. నిబంధనల ప్రకారం థర్డ్ అంపైర్ బెయిర్ స్టో ఔట్ అని ప్రకటించాడు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఆస్ట్రేలియా ప్రవర్తించిందంటూ అభిమానులు సహా ఇంగ్లీష్ మీడియా తమ కథనాల్లో హోరెత్తించింది. విమర్శల స్థాయి ఎలా ఉందంటే అది మూడో టెస్టుకు కూడా పాకింది. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అలెక్స్ కేరీ కనిపించిన ప్రతీసారి ఇంగ్లీష్ అభిమానులు అతన్ని టార్గెట్ చేశారు.
ఇక బెయిర్ స్టో ఔట్ వివాదంపై రెండు దేశాల ప్రధానులు కూడా జోక్యం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమంటే.. ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ రిషి సునాక్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అయితే క్రికెట్ అనేది జెంటిల్‌మెన్ గేమ్ అని.. ఇక్కడితో ఈ వివాదానికి స్వస్తి పలకాలని ఇరు దేశాల ప్రధానులు అభిమానులను కోరారు.
తాజాగా ఇరుదేశాల ప్రధానులు మరోసారి సమావేశమయ్యారు. అయితే ఈసారి దేశాల మధ్య అనుబంధం మరింత పెంపొందించేందుకు సమ్మిళిత అభివృద్ధి సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ చాలెంజెస్, యూకే-ఆస్ట్రేలియా మధ్య వ్యాపార రంగానికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నారు. వీటిలోనే యాషెస్ సిరీస్ ప్రస్తావన కూడా వచ్చినట్లు ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ ట్విటర్ వేదికగా తెలిపారు.
ఆసీస్ ప్రధాని ఆంథోని షేర్ చేసిన వీడియోలో.. యాషెస్‌పై ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మొదట అల్బనీస్ యాషెస్‌లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉన్నట్లు ఒక పేపర్‌పై చూపించారు. ఆ తర్వాత రిషి సునాక్ లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన పేపర్ కట్‌ను చూపించారు. ఇక ఆసీస్ ప్రధాని ఈసారి లార్డ్స్ టెస్టులో బెయిర్ స్టో ఔటైన విధానంకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను చూపించగా.. రిషి సునాక్.. ''సారీ తాను శాండ్‌పేపర్(Sandpaper-Ball Tampering) గేట్ ఉదంతం పేపర్ క్లిప్పింగ్‌ను మరిచిపోయాను'' అంటూ పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శాండ్‌పేపర్ వివాదమేంటి?
రిషి సునాక్ ప్రస్తావించిన శాండ్ పేపర్ వివాదం 2018లో జరిగింది. ఐదేళ్ల క్రితం సౌతాఫ్రికాతో టెస్టు సందర్భంగా ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్ ముక్కతో బంతిని రుద్దడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇలా చేయడం వల్ల బంతి స్వింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ శాండ్‌పేపర్ ఉదంతం వెనుక అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లది కీలకపాత్ర అని తేలడంతో ఏడాది నిషేధం పడింది.
బెన్‌క్రాఫ్ట్ తొమ్మిది నెలలు నిషేధానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ తన తప్పును క్షమించమంటూ కెమెరా ముందు బోరున ఏడ్వడం ఎప్పటికి మరిచిపోలేం. ఈ ఉదంతం అనంతరం స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఏడాది తర్వాత స్మిత్, వార్నర్‌లు మళ్లీ జట్టులోకి రాగా.. బెన్‌క్రాఫ్ట్ మాత్రం మళ్లీ అడుగుపెట్టలేకపోయాడు.
And of course we discussed the #Ashes pic.twitter.com/FeKESkb062
— Anthony Albanese (@AlboMP) July 11, 2023
చదవండి: Asia Cup 2023: 'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే'
Comments
Please login to add a commentAdd a comment