Rohit Sharma Comments On Tilak Varma: ప్రపంచ కప్‌ను ఎవరూ పళ్లెంలో పెట్టి ఇవ్వరని, దాని కోసం చాలా కష్టపడాల్సి ఉంటుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. 2011 నుంచి టైటిల్ సాధించేందుకు శ్రమిస్తూనే ఉన్నామన్న హిట్‌మ్యాన్.. ప్రతీ ఐసీసీ టోర్నీ సమయంలో గెలవగలమనే నమ్మకంతోనే బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు.
ఏదో ఒకరోజు గెలుస్తాం
ఫలితం రాకపోయినా వచ్చేసారి గెలుస్తామనే నమ్ముతామంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. కచ్చితంగా ఏదో ఒక రోజు కప్ అందుకుంటాం కదా అంటూ ఈ ముంబైకర్ తన భావాన్ని వెల్లడించాడు. కాగా 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా... ఆ తర్వాత 2013లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో ఐసీసీ టైటిల్ సాధించింది.
అసలు పోరులో టీమిండియా తడబాటు
అయితే, అప్పటి నుంచి దశాబ్ద కాలంగా మళ్లీ మేజర్ టైటిల్ గెలవలేకపోయింది. ముఖ్యంగా ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొడుతున్నా అసలు పోరులో చేతులెత్తేస్తోంది. ఐసీసీ ఈవెంట్లలో చాలా వరకు సెమీస్‌లోనే ఇంటి బాట పడుతోంది. అయితే, ఈసారి భారత జట్టు సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడనుండటం రోహిత్ సేనకు సానుకూల అంశంగా మారింది. అక్టోబరు 5 నుంచి మొదలుకానున్న ఈ మెగా టోర్నీలో గెలిచి మరోసారి ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలగా ఉంది.
ఎవరికీ సుస్థిర స్థానం లేదు
అయితే, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉండటం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్ సన్నాహకాల గురించి విలేకరులు ప్రశ్నించగా.. జట్టులో ఎవరికీ సుస్థిర స్థానం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. గాయాల నుంచి కోలుకున్న వాళ్లు కూడా పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించినా జట్టులో చోటు కోసం పోటీ పడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
కొత్తవారిని తీసుకున్నా ఆశ్చర్యం లేదు
అంతేకాదు.. తగినంత అనుభవం లేకపోయినా అనూహ్యంగా ఎవరైనా కొత్తవారిని తీసుకోవడంలో తప్పు లేదని, అయితే అది అరుదుగా మాత్రమే సాధ్యమవుతుందని రోహిత్ చెప్పాడు. 2021 టి20 వరల్డ్‌కప్‌లో వరుణ్ చక్రవర్తి ఇలాగే జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు.
ప్రపంచకప్‌లో తిలక్ వర్మ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ?
ఈ నేపథ్యంలో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ గురించి ప్రస్తావన రాగా... ‘‘అతని వయసును బట్టి చూస్తే చాలా పరిణతి కనబరుస్తున్నాడు. ఎలాగైనా పరుగులు సాధించాలనే తపన తిలక్‌లో కనిపిస్తోంది’’ అని ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడి గురించి ఇంతవరకే నేను మాట్లాడగలను. వరల్డ్ కప్, వన్డే జట్టులో చోటు గురించి ఇప్పుడేమీ చెప్పలేను.
కలిసొచ్చే అంశాలు.. కన్‌ఫార్మ్‌గా
అయితే, టీమిండియాకు ఆడిన కొన్ని మ్యాచ్‌లలోనే తనదైన ముద్ర వేయగలిగాడు తిలక్. అతడు టాలెంటెడ్ క్రికెటర్’’ అని రోహిత్ శర్మ.. తిలక్ వర్మను కొనియాడాడు. ఈ నేపథ్యంలో అనూహ్య ఎంపికల గురించి రోహిత్ ప్రస్తావించడం, తిలక్ ఎంట్రీ గురించి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేయడం చూస్తుంటే.. హైదరాబాదీ వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అభిమానులు సంబరపడుతున్నారు.
ఇక మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో అనిశ్చితి, శ్రేయస్ నెలల తరబడి జట్టుకు దూరంగా ఉండటం.. తిలక్ వర్మకు కలిసొచ్చే ఛాన్స్ ఉందని ఇప్పటికే మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ప్రయోగాలు.. ఆసీస్‌తో ఆడిస్తే
రోహిత్ సైతం నం.4 గురించి ప్రస్తావించడం ఈ లెఫ్టాండర్‌కు కలిసొచ్చే అంశం. అంతేకాదు.. ఇప్పటికే రోహిత్- ద్రవిడ్ ద్వయం పలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో..ఐపీఎల్‌లో తన సారథ్యంలో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న తిలక్‌ను దగ్గరగా గమనించిన హిట్‌మ్యాన్.. అతడి వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉన్నాయి.
అంతేకాదు.. వరల్డ్‌కప్ కంటే ముందు ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుతో స్వదేశంలో వన్డే సిరీస్‌లో ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగొడుతున్న తిలక్ వర్మ వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మిడిలార్డర్‌లో వచ్చి మూడింటిలో వరుసగా 39, 51,49 పరుగులతో సత్తా చాటాడు.
చదవండి: తిలక్ హాఫ్ సెంచరీని అడ్డుకున్న హార్ధిక్.. కొట్టిపారేసిన హర్షా, ఏకీభవించిన ఏబీడీ
Comments
Please login to add a commentAdd a comment