చెన్నై: భారత రెగ్యులర్ ఆటగాళ్లు పదే పదే గాయాలబారిన పడటం, కీలక మ్యాచ్‌లకు దూరం కావడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. వారికి తగినంత విశ్రాంతి కల్పించడంపై అతను కీలక వ్యాఖ్యలు చేశాడు.
''ఇకపై ఆటగాళ్లంతా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందినవారే. టోర్నీ ముగిసేవరకు వారి పర్యవేక్షణలోనే ఉంటారు. ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే విషయంపై బోర్డు సూచనలు అందరికీ ఇచ్చింది. కానీ వాటిని ఫ్రాంచైజీలు పాటిస్తాయా లేదా అనేది సందేహమే. అన్నింటికి మించి క్రికెటర్లేమీ చిన్నపిల్లలు కారు. వారికే తమ శరీరం గురించి, గాయాల గురించి స్పష్టత ఉంటుంది.
దానిని బట్టి ప్రణాళిక రూపొందించుకోవాల్సిందే తప్ప వేరే వాళ్లు చేసేదేమీ లేదు. అయినా భారత జట్టుకు ఆడుతున్నప్పుడు తగినంత విరామం ఇస్తూనే ఉన్నాం'' అని రోహిత్ అభిప్రాయపడ్డాడు.ఏ క్రికెటర్ కూడా గాయపడాలని కోరుకోడని, అందరికీ అన్ని మ్యాచ్‌లు ఆడాలనే ఉంటుందని కెప్టెన్ అన్నాడు.
''గాయాలు తిరగబెట్టడంపై మాట్లాడేందుకు నేనేమీ నిపుణుడిని కాను. అయితే గాయాల ఆటగాళ్ల కెరీర్‌లో భాగం. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది వారి పరిస్థితిని మెరుగుపర్చేందుకు అత్యుత్తమ చికిత్స అందిస్తుందనే విషయం నాకు తెలుసు. కానీ అనూహ్యంగా జరిగే వాటి గురించి ఎవరూ చెప్పలేరు'' అని రోహిత్ విశ్లేషించాడు.
Comments
Please login to add a commentAdd a comment