సూర్య‌ను తొల‌గించ‌డంపై రోహిత్ స్పందన! | Rohit-sharmas-Reaction-On-Shreyas-Iyer-Becoming-T20i-Skipper-Nothing-Comes-Easy | Sakshi
Sakshi News home page

అయ్యర్‌కు కెప్టెన్సీ.. సూర్య‌ను తొల‌గించ‌డంపై రోహిత్ స్పందన!

Jun 7 2026 7:20 AM | Updated on Jun 7 2026 11:22 AM

Rohit-sharmas-Reaction-On-Shreyas-Iyer-Becoming-T20i-Skipper-Nothing-Comes-Easy

టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్య‌కుమార్ స్థానంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను ఎంపిక చేయ‌డంపై సీనియ‌ర్ క్రికెట‌ర్ రోహిత్ శర్మ స్పందించాడు. కెప్టెన్సీ అనేది అంత సుల‌భంగా రాద‌ని అయ్య‌ర్‌ను చూస్తే త‌న‌కు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంద‌ని తెలిపాడు. 2024లో కేకేఆర్‌కు టైటిల్ అందించిన అయ్య‌ర్ మ‌రుస‌టి ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఫైన‌ల్ చేర్చాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌లే ఇవాళ టీమిండియా టీ20 కెప్టెన్‌ను చేసింద‌ని పేర్కొన్నాడు. అక్క‌డ నేర్చుకున్న విష‌యాలు ఇవాళ భార‌త కెప్టెన్సీకి అవ‌స‌ర‌మైన అనుభ‌వాన్ని అందించ‌నుంద‌ని తెలిపాడు.  

టీ20 ముంబై లీగ్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న రోహిత్ శ‌ర్మ శ‌నివారం మ్యాచ్‌కు హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘గ‌త కొన్నేళ్లుగా శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆట‌తీరు చూసుకుంటే అత‌డు కెప్టెన్‌గా అద్భుతాలు చేయ‌బోతున్నాడ‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ముంబై క్రికెట‌ర్ల‌కు ఏదీ సుల‌భంగా రాద‌ని, కెప్టెన్సీ అనే హోదాను క‌ష్ట‌ప‌డి సంపాదించుకోవాల‌న్న విష‌యం శ్రేయ‌స్‌కు తెలుసు.’అని వివ‌రించాడు. 

సూర్య‌కుమార్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తొల‌గించడంపై కూడా రోహిత్ స్పందించాడు. ‘టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్య‌కుమార్‌ త‌నదైన‌ ముద్ర వేశాడు. సూర్య‌కుమార్‌కు కెప్టెన్సీ అంత సుల‌భంగా ద‌క్క‌లేదన్న విష‌యం నాకు తెలుసు. ఎందుకంటే సూర్య‌కుమార్ జ‌ట్టులోకి వ‌చ్చే స‌మ‌యానికే అత‌డి వ‌య‌సు 31 లేదా 32 ఉంటుంది. ఆ వ‌య‌సులో ఫామ్‌లో ఉండ‌డమే గొప్ప విష‌యం. 

కానీ సూర్య దానిని అధిగ‌మించ‌డ‌మే కాదు టీ20 క్రికెట్‌లో ఆట‌గాడిగా, కెప్టెన్‌గా త‌న‌దైన ముద్ర వేశాడు. ఎల్ల‌ప్పుడూ పోరాడడంలో సూర్య ముందుండే వాడు. భార‌త్‌కు మూడో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ రావ‌డంలో కెప్టెన్‌గా అత‌డి పాత్ర అమోఘం. త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను సూర్య రెండు చేతులా ఒడిసి ప‌ట్టుకున్నాడు. 

ఐదేళ్ల‌లోనే అత‌డు టీమిండియాకు ఎంతో చేశాడు. ముంబై ఆట‌గాళ్ల‌లోనే ఇది స్వ‌త‌హాగా ఉన్న ల‌క్ష‌ణం. ఏదీ ఊరికే రాదు, క‌ష్ట‌ప‌డి సంపాదించుకోవాల్సిందే అన్న విష‌యం మా క్రికెట‌ర్ల‌కు తెలుసు.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్‌ శర్మ గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ ఆడడం అనుమానమే. 

గాయంతో బాధపడుతున్న భారత జట్టు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఈనెల 8న సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ (సీఓఈ)లో చేరనున్నాడు. బెంగళూరులోని ఈ సెంటర్‌లో అతడి ఫిట్‌నెస్‌ను పరీక్షించనున్నారు. మూడు రోజుల పాటు సీఓఈలో ఉండి, ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్‌ కోసం జట్టుతో చేరనున్నాడు.

చదవండి: క్రీడాస్ఫూర్తిని మంటగలిపిన కేఎల్ రాహుల్‌!

Advertisement
 
Advertisement
Advertisement